iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి హస్తినలో పర్యటిస్తున్నారు. స్వల్పవ్యవధిలోనే నేరుగా ప్రధాని అపాయింట్ మెంట్ ఆయనకు లభించింది. దాంతో మోడీతో జగన్ భేటీ రాజకీయంగా చర్చకు తెరలేపుతోంది. కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనూహ్యంగా జగన్ ఢిల్లీ పర్యటన ఖరారుకావడం వెనుక కారణాలపై పలు చర్చలు సాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్ధతుని బీజేపీ ఆశించడం ఒకటి. దానికి అనుగుణంగానే పీఎం, సీఎం మధ్య చర్చలు జరుగుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు చర్చకు రాబోతుండడంతో అమరావతి అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల హైకోర్టు తీర్పు, దాని మీద అసెంబ్లీ వేదికగా సాగిన చర్చల తర్వాత ఏపీ ప్రభుత్వం 60 నెలల గడువు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసింది. దాని మీద హైకోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈలోగా సీఎం ప్రధానితో భేటీ కాబోతున్న తరుణంలో కొత్తగా జిల్లాల విభజన కార్యరూపం దాల్చిన సంగతిని ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో పాలనా వికేంద్రీకరణకు కట్టుబడిన ప్రభుత్వ విధానం గురించి ప్రస్తావన కూడా ఉండబోతోంది. ఇప్పటికే కేంద్రం కూడా రాష్ట్రాల రాజధానుల అంశంలో తమ పాత్ర ఉండదని అధికారికంగానే వెల్లడించినందున మోడీ నుంచి పూర్తి మద్ధతు లభించే అవకాశం ఉంది.
ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ఇటీవల టీడీపీ గూటి వైపు అడుగులు వేస్తుండడం, అదే సమయంలో చంద్రబాబు తన పార్టీ నేతలను సోనియాతో బ్రేక్ ఫాస్ట్ మీటింగులకు పంపించడం వంటివి జరిగాయి. ఈ తరుణంలో మోడీతో జగన్ భేటీ కావడం ఆసక్తిదాయకం. రాష్ట్రానికి సంబంధించిన రైల్వేజోన్ వంటి అంశాలకు ఇటీవల కొంత సానుకూలత వినిపించింది. పోలవరం సహా ఇతర అంశాలను కూడా కేంద్రం సానుకూలంగా పరిష్కరించాలని కోరబోతున్నారు. అదే సమయంలో రాజధానుల అంశంలో తమ వైఖరిని పీఎం దృష్టికి తీసుకెళ్లి తదుపరి ప్రణాళికను కూడా ప్రస్తావించబోతున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వివిధ అంశాలు ఈ భేటీలో చర్చకు రాబోతున్నాయి. అందులో కొన్నింటికి పరిష్కారం కూడా ఉంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రాజకీయంగా బీజేపీకి వైఎస్సార్సీపీ అండదండలు అవసరం. దానికి తగ్గట్టుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూతను జగన్ ఆశిస్తున్నారు. రాష్ట్రం కోసం జగన్ చేస్తున్న డిమాండ్లకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లభించేందుకు ఇదే తగిన సమయం అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఏమయినా ఢిల్లీలో జగన్ ఈసారి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో మోడీతో పాటుగా అమిత్ షా తోనూ జగన్ భేటీ అవుతారు. కాబట్టి కీలక అంశాల్లో కదలిక ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.