Idream media
Idream media
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించింది. ఫలితంగా ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. ఇప్పుడు ఆ పాత్రను కూడా అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తోందన్న పేరు పొందుతోంది. వైసీపీ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. స్థానిక, ఉప ఎన్నికల్లో రికార్డు విజయాలను అందించారు. ఈ క్రమంలో విజయగర్వం పెరగకుండా వైసీపీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. అలాగే.. మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా తొలుత బీసీ వర్గాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం బీసీలకు ప్రారంభం నుంచీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతీ సంక్షేమ పథకంలోనూ బీసీలకు వాటా ఇస్తోంది. అంతేకాకుండా బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. పదిలక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించి అభివృద్ధికి బాటలు వేసింది. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేయకుండా.. రాష్ట్రల్లో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించింది.
అంతేకాకుండా.. జగన్ హయాంలో 2.71 కోట్ల మందికి పైగా బీసీలకు లబ్ధి చేకూర్చింది. సుమారు రూ. 40 వేల కోట్ల మేర ప్రయోజనాలు అందించింది. తాజాగా ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో కులాల వారీగా జనగణన జరిపించాలని కోరారు. బీసీ జనాభాకు తగినంత రిజర్వేషన్ కల్పించాలని ప్రధానిని కోరినట్లు ఎంపీ సుభాష్ చంద్రబోస్ వివరించారు. న్యాయ వ్యవస్థలో జడ్జి పదవుల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీ లకు సరియైన ప్రాతినిధ్యం దక్కడంలేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బీసీ వర్గాలకు సముచిత న్యాయం కులగణన వల్లనే సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ మంత్రి వర్గ విస్తరణలో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బీసీ మంత్రులు కీలకంగా సమావేశం అయ్యారు. బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, అనిల్ యాదవ్, శంకర్ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా హాజరయ్యారు. రానున్న రోజుల్లో జిల్లాల వారీగా బీసీ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చాక బీసీలకు చేసిన మేళ్లు పై క్షేత్రస్థాయిలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత రెండు, మూడు జిల్లాలకు కలిపి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన పనులను వివరించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మరింతగా ఆదరణ పొందేందుకు బాటలు వేసుకుంటున్నారు. ఇలా మిగతా వర్గాలపై దృష్టి సారించనున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా చూస్తే వైసీపీ వ్యూహానికి విపక్షం చిత్తు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.