iDreamPost
android-app
ios-app

బెడిసికొట్టిన బాబు వ్యూహం, సీఎం సామర్థతతో చిక్కుల్లో పడిన టీడీపీ

  • Published Mar 24, 2022 | 9:01 AM Updated Updated Mar 24, 2022 | 9:06 AM
బెడిసికొట్టిన బాబు వ్యూహం, సీఎం సామర్థతతో చిక్కుల్లో పడిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడింది. తానే సమస్యను కొనితెచ్చుకున్నట్టయ్యింది. రెండేళ్లుగా ఎంత రాద్ధాంతం చేస్తున్నా మౌనంగా ఉన్న ప్రభుత్వం వైపు నుంచి చివరకు నేరుగా సీఎం సీన్ లోకి రావడంతో టీడీపీని ఇక్కట్లలో పడేసింది. లిక్కర్ బ్రాండ్లు, డిస్టిలరీల చుట్టూ టీడీపీ రాజకీయ డ్రామా అంతాఇంతా కాదు. జే బ్రాండ్లు అంటూ మద్యం చుట్టూ తిరిగడమే పనిగా పెట్టుకుంది. చివరకు అదే ఇప్పుడు టీడీపీకి బూమరాంగ్ అయ్యింది. బండారం బట్టబయలయ్యింది. టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. జగన్ ని బోనెక్కించాలని చూస్తే చివరకు సామాన్యుల ముందు టీడీపీ దోషిగా నిలబడాల్సి వచ్చింది. దాంతో బాబు వ్యూహం బెడిసికొట్టి తెలుగుదేశం కష్టాలు రెట్టింపయ్యేందుకు దోహదపడింది.

ఏపీ ప్రభుత్వం చాలాకాలంగా మౌనం పాటిస్తోంది. మద్యం చుట్టూ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారం రోజులుగా టీడీపీ మరో సమస్యలేనట్టుగా మద్యం చుట్టూ గందరగోళం చేస్తోంది. సభ వెలుపల మాత్రమే కాకుండా సభలో సైతం వీరంగం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. చివరకు చిడతలాటకి సైతం సిద్ధపడింది. మద్యంతో సీఎం చిత్రపటానికి అవమానం చేసినా ఖాతరు చేయని ప్రభుత్వం ఆఖరికి టీడీపీకి బుద్ధి చెప్పాలని సంకల్పించుకున్నట్టు కనిపించింది. నేరుగా జగన్ రంగంలో దిగి పించ్ హిట్టర్ మాదిరిగా చెలరేగిపోయారు. బుధవారం సభలో ఆయన బ్యాటింగ్ కి టీడీపీ కి దిమ్మ తిరిగిపోయే పరిస్థితి వచ్చింది. అనేక అంశాలు సూటిగా జనంలోకి తీసుకెళ్లడంతో టీడీపీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

సీఎం జగన్ నేరుగా పలు బ్రాండ్లను ప్రస్తావించారు. వాటికి అనుమతి ఎప్పుడిచ్చారో తెలిపారు. చంద్రబాబు పాత్రను చాటిచెప్పారు. ఈ బ్రాండ్ల చుట్టూ రెండేళ్లుగా టీడీపీ చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆపార్టీ శ్రేణులు సృష్టించిన గందరగోళం కూడా హద్దు లేకుండా ఉండేది. దాంతో సహనం నశించిన సీఎం సమాధానం టీడీపీకి తలబొప్పికట్టించింది. ఆ బ్రాండ్లన్నీ బాబు ఖాతాలోనివేనని తేలడం, ఆయా డిస్టిలరీల యజమానులు ముఖ్యంగా యనమల నుంచి అయ్యన్నపాత్రుడి వరకూ ఎవరి పాత్ర ఏమిటన్నది సభ సాక్షిగా బయటపడడంతో టీడీపీకి కొత్త తలనొప్పిగా తయారయ్యింది. ఏపీ ప్రభుత్వానికి అప్పులు లభించకూడదని, ఆఖరికి రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందకూడదని, తాజాగా మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకి చేరకూడదనే సంకల్పం తప్ప టీడీపీకి మరో లక్ష్యం లేదనే విషయాన్ని సీఎం సూటిగానే చెప్పేశారు. దాంతో ఇది చుట్టూ తిరిగి టీడీపీ మెడకు, ఆపార్టీ నాయకులకు చుట్టుకోవడం మింగుడుపడని పరిస్థితి.

టీడీపీ ఇంతకాలంగా ఆరోపిస్తున్నట్టు బ్రాండ్లన్నీ కల్తీవయితే అందుకు టీడీపీ నేతలే కారణమవుతారు. డిస్టిలరీలలో నకిలీ సరుకు వస్తుందంటే దానికి బాబు బ్యాచ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయినా వాస్తవాలను కప్పిపుచ్చి, ఎల్లకాలం జనాలను జగన్ మీద ఎగదోయాలనే తాపత్రయంలో టీడీపీ నాయకత్వం చేసిన తప్పిదం ఇప్పుడు తమకే ఎదురుతిరిగే పరిస్థితి వచ్చింది. మద్యం నాటకం రక్తికట్టకపోగా ఇప్పుడు వారి మొఖాన నెత్తుటి చుక్కలేని స్థితికి చేర్చింది. జగన్ విషయంలో టీడీపీ నాయకత్వం మౌనాన్నే బలహీనతగా చూసి భంగపడినట్టుగా మద్యం వివాదం చాటిచెబుతోంది. ఆపార్టీ తీరు మార్చుకోకపోతే జగన్ కి మరింత జనాదరణ పెంచేందుకే తోడ్పడడం తప్ప మరో మార్గం లేదనే అంశాన్ని చాటిచెబుతోంది.