iDreamPost
android-app
ios-app

అఖిలేష్ బాబాయికి బీజేపీ రాజ్యసభ ఆఫర్…?

అఖిలేష్ బాబాయికి బీజేపీ రాజ్యసభ ఆఫర్…?

ఇటీవ‌లే ఎన్నిక‌ల సంగ్రామం ముగిసింది. సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర‌స్థాయిలో పోరాడినా ఓట‌మి పాలైంది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. యోగి స‌ర్కారు మ‌రోసారి కొలువైంది. కానీ.. ఇంకా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ట్విస్ట్ లు కొన‌సాగుతున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దాని ద్వారా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ఎత్తుగడ వేస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రమంలో అఖిలేష్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌కు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది.

శివపాల్‌ యాదవ్ ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు. అఖిలేష్ కు బాబాయ్. తాజాగా జ‌రిగిన‌ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయ‌న‌తో క‌లిసి పోటీ చేశారు. ఆ సంద‌ర్భంగా తమ మధ్య గ‌తంలో ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు వారిద్దరూ సంకేతాలిచ్చారు. అఖిలేష్‌తో కలిసి శివపాల్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎస్పీ టికెట్‌పై జస్వంత్‌నగర్ స్థానంలో పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించలేకపోయింది. మళ్లీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బాబాయ్‌ శివపాల్‌, అబ్బాయ్‌ అఖిలేష్ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లు ఇటీవ‌ల ప‌రిణామాల ద్వారా తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభా సమావేశం కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ను పార్టీ సభా నేతగా ఎన్నుకున్నారు. దీంతో యూపీ అసెంబ్లీలో విపక్షనేతగా ఆయన వ్యవహరించనున్నారు.

కాగా, కీలకమైన ఈ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని అఖిలేష్ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తాను అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతోపాటు రెండు రోజులుగా ఎదురుచూసినట్లు ఆయన తెలిపారు. తాను సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎస్పీఎల్పీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని వాపోయారు. ఓ వార్తా సంస్థ‌తో బ‌హిరంగంగానే అసంతృప్తిని, ఆవేదనను వెళ్ల‌గ‌క్కారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ మధ్య మళ్లీ లుకలుకలు తలెత్తెనట్లు తెలుస్తున్నది.

ఇదే శివపాల్‌ యాదవ్‌ గత రెండురోజులగా ఢిల్లీలో మకాం వేశారు. ఆపై బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కూడా అయ్యారు. అయితే ఆ భేటీ మర్యాదపూర్వకమైందేనని మీడియాకు చెప్పినా కానీ.. ఆయనకు రాజ్యసభ సీటును బీజేపీ ఆఫర్‌ చేసిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. శివపాల్ యాదవ్ బీజేపీలో చేరొచ్చని.. ఆయనను రాజ్యసభలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానికి బీజేపీ ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఆయన ఎటావాలోని జస్వంత్‌నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయవచ్చని.. శివపాల్ సింగ్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరపున ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్‌ను అభ్యర్థిగా చేయవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ప‌రిణామాలు యూపీ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌ను రేపుతున్నాయి.