iDreamPost
android-app
ios-app

పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై విచారణకు హౌస్ కమిటీ -అసెంబ్లీలో తీవ్ర చర్చ.. స్పీకర్ నిర్ణయం

  • Published Mar 21, 2022 | 6:52 PM Updated Updated Mar 21, 2022 | 7:12 PM
పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై విచారణకు హౌస్ కమిటీ  -అసెంబ్లీలో తీవ్ర చర్చ.. స్పీకర్ నిర్ణయం

రాజకీయ దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు శాసనసభా కమిటీని నియమించనున్నారు. ఈ అంశంపై చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ విషయం ప్రకటించారు. గత తెలుగుదేశం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నుంచి రూ. 25 కోట్లతో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడంతో జాతీయ స్థాయిలో కొన్ని నెలలుగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకుంది. సోమవారం ఈ అంశంపై చర్చ సందర్బంగా అసెంబ్లీ దద్దరిల్లింది. మెజారిటీ సభ్యులతోపాటు ప్రభుత్వం కూడా పెగాసస్ పై వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నందున.. ప్రభుత్వ సూచన మేరకు హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు స్పీకర్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో కమిటీ సభ్యుల పేర్లు ప్రకటిస్తామన్నారు.

ఎందుకు కొన్నారో.. ఎవరిపై ప్రయోగించారో తెలియాలి

సోమవారం శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పెగాసస్ పై చర్చ జరగాలని కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఆ మేరకు స్పీకర్ స్వల్పకాలిక చర్చకు అనుమతించారు. మొదట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది ఆగష్టులో వెలుగులోకి వచ్చిన పెగాసస్ కొనుగోళ్ల ఉదంతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని గుర్తు చేశారు. దాదాపు 300 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా పెట్టడాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకొని ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అదే స్పైవేర్ ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తమ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించడం చిన్న విషయం కాదన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి మరో రాష్ట్ర మాజీ సీఎంపై అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన ఈ కొనుగోళ్లపై విస్తృత చర్చ జరగాలన్నారు. నాటి సీఎం చంద్రబాబు దేశ రక్షణ నిబంధనలు ఉల్లంఘించి ఈ నిఘా పరికరాలు ఎందుకు కొన్నారో.. వాటిని ఎవరిపై ప్రయోగించారో తేలాలంటే విచారణ జరిపించాలని కోరారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ నాడు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్.. పెగాసస్ సంస్థ ప్రతినిధులు తమను సంప్రదించిన మాట నిజమేనని అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.

చర్చకు టీడీపీ అడ్డంకులు.. సస్పెన్షన్

స్పైవేర్ వ్యవహారంపై జరిగిన చర్చను అడ్డుకుని సభ సాగకుండా చేసేందుకే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక ముఖ్యమంత్రి తమ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఆషామాషీ వ్యవహారంగా పేర్కొంటూ చర్చకు అడుగడుగునా అడ్డు తగిలారు. ఒకవైపు దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని అంటూనే మరోవైపు చర్చ జరగకూడదని పట్టుబట్టారు. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గందరగోళం సృష్టిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం జరిగిన చర్చలో సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలు, ప్రభుత్వ సూచన మేరకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.