iDreamPost
iDreamPost
రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని ప్రముఖ సినీనటుడు సుమన్ వ్యాఖ్యానించారు. పేదల ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కనీసం మరో పదేళ్లు ఆ పదవిలో కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారిపోతుందన్నారు. కనీసం 15 ఏళ్లు ఒకే ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. ప్రజలు జగన్ కు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని అంటూ అదే జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు
తెలంగాణ వేరుపడిన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని సుమన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమల్లోకి వచ్చిన నవరత్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. సినీ రంగం గురించి ప్రస్తావిస్తూ సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని సుమన్ అన్నారు. సినీ పరిశ్రమ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయాలే తీసుకుందని అన్నారు. బయ్యర్లు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని చెప్పారు.
ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు గాను ముఖ్యమంత్రి జగన్ కు సినీ పరిశ్రమ రుణపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని పరిశ్రమ పెద్దలకు ఆయన సూచించారు. అలా ముందుకొచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.