iDreamPost
android-app
ios-app

రేపల్లె రేసులో సినీ హీరో, ఈసారయినా ఛాన్స్ వస్తుందా?

  • Published Mar 28, 2022 | 8:30 AM Updated Updated Mar 28, 2022 | 8:30 AM
రేపల్లె రేసులో సినీ హీరో, ఈసారయినా ఛాన్స్ వస్తుందా?

తెలుగు సినీరంగంలో గుర్తింపుపొందిన నటుల్లో సుమన్ ఒకరు. సినీరంగం నుంచి ఆ తర్వాత ఆయన సేవా రంగంలోకి కూడా మళ్లారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అయితే ఆయనకు రాజకీయంగా అవకాశం రావాలని ఎదురుచూస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తో కొంత సన్నిహితంగా మెలిగారు. అసెంబ్లీ సీటు కోసం కొంత ప్రయత్నం కూడా జరిగినా ఆయన గట్టిగా పట్టుబట్టలేదు. ప్రస్తుతం ఆయన ఆశలు మరింత చిగురించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ వైపు ఆయన మొగ్గుచూపుతున్నారు. ఏపీలో జగన్ నాయకత్వానికి జనాదరణ ఉందని భావిస్తున్నారు. దానిని ఆయన బాహాటంగానే వెల్లడించారు. జగన్ వెంట జనం ఉన్నారని, ప్రజా సంక్షేమంలో జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశంసించారు.

వచ్చే ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆయన ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సీటులో వరుసగా రెండుమార్లు వైఎస్సార్సీపీ ఓటమి పాలయ్యింది. రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన 2019లో ఓటమి తర్వాత కూడా మండలిలో ఛాన్స్ దక్కింది. జగన్ వెంట నడిచినందుకు ప్రతిఫలంగా ఆయనకు అవకాశాలు మెండుగా దక్కాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్నందున వచ్చే ఎన్నికల బరిలో ఆయన దిగే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు.. కొంతకాలం మోపిదేవి సోదరుడు, ఇటీవల మోపిదేవి తనయుడు రాజీవ్ కూడా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. అంతకుముందు ఓసారి తన కుమార్తెని కూడా మోపిదేవి నేరుగా సీఎం దగ్గరకి తీసుకెళ్లి పరిచయం చేశారు. తన రాజకీయ వారసులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో మోపిదేవి ఉన్నట్టు ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, ప్రస్తుతం ఎంపీగా ఉండడం వంటి కారణాలతో మళ్లీ ఆయనకు అవకాశం వస్తుందా రాదా అనేది అనుమానమే. దాంతో కొత్త అభ్యర్థికోసం పార్టీ అధిష్టానం అన్వేషిస్తే ఆ అవకాశం తనకుంటుందనే అభిప్రాయం హీరో సుమన్ కి ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్ , హీరో సుమన్ కూడా ఒకే కులస్తులు. గౌడ కులస్తులు సంఖ్యరీత్యా ఎక్కువగా ఉండడం, మత్స్యకారుల్లో వైఎస్సార్సీపీకి మొగ్గు ఉండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ కుల సమీకరణాలు సుమన్ కి, వైఎస్సార్సీపీకి ఉపయోగపడతాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దాంతో ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమే.

మరోవైపు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మీద అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ఉంది. నిత్యం హైదరాబాద్ లో ఉండడం ఆయనకు మైనస్ అవుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా మెలగడం అనగానికి టీడీపీ శ్రేణుల్లో ఆదరణ తగ్గుతోంది. కొందరు నాయకులు నేరుగా చంద్రబాబుకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా అధినేత కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడంతో సత్యప్రసాద్ కి చెల్లుబాటు అవుతోంది. దాంతో సత్యప్రసాద్ కి ప్రత్యర్థిగా సుమన్ బరిలో దిగితే పరిస్థితి ఆసక్తిగా మారే అవకాశం ఉంటుంది.