Idream media
Idream media
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే బీజేపీ సభ్యులను బయటకు పంపేశారు. ఆ తర్వాత పదినిమిషాలకే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిపక్షాలు లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు బీజేపీ సభ్యులు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ సైతం తమ తమ స్థానాల్లోనే ఉండి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశం ప్రారంభించడంపై నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్‌లోకి దూసుకొచ్చారు. దాంతో, బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా బీజేపీ సభ్యులు ముగ్గురినీ సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యులు వెంటనే దానిని ఆమోదించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా రాజాసింగ్, రఘునందన్, రాజేందర్‌లను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అధికారపక్షంలో ఉన్న ఈటెల రాజేందర్ ఈసారి ప్రతిపక్షంలోకి మారారు. తొలుత బీజేపీ సభ్యులు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి.. కేసీఆర్ తన సొంత రాజ్యాంగం పేరిట గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపిస్తూ నల్లకండువాలు ధరించి అమరులకు నివాళులు అర్పించారు.అంతకుముందు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటెలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. శామీర్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉదయమే పెద్దఎత్తున మోహరించారు. ఈటెల సహా ఎవరికీ అనుమతిలేదని, ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని మేడ్చల్ పోలీసులు తెలిపారు. అయితే, ఈటెల ఎమ్మెల్యే అన్న సంగతి గుర్తుంచుకోవాలని చెప్పడంతో కొంత వెనక్కి తగ్గారు. ఈటెల బయలుదేరిన తర్వాత మళ్లీ అడ్డుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేగా ఈటెల తొలిసారిగా సభకు వచ్చారు. సభ ప్రారంభానికి ముందే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ సైతం ఈటెల రాజేందర్‌తోపాటు రఘునందన్, రాజాసింగ్ వద్దకు వచ్చి కరచాలనం చేసి భుజం తట్టారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా వరుసగా నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల.. ఈసారి బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన అరగంటకే బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడేళ్లపాటు మంత్రిగా మొదటి వరుసలో కూర్చున్న ఆయన.. ఈసారి ప్రతిపక్ష సభ్యుడిగా మూడో వరుసకు మారారు.