iDreamPost
android-app
ios-app

గుత్తాకు మరోసారి అవకాశం?

  • Published Mar 12, 2022 | 6:31 PM Updated Updated Mar 13, 2022 | 7:35 PM
గుత్తాకు మరోసారి అవకాశం?

తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 14న ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఎన్నికకు ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే సోమవారం ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు మండలి సభ్యులందరికీ సమాచారం పంపారు. కాగా మండలిలో మెజారిటీ సభ్యుల బలం ఉన్న అధికార తెరాస పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఖాయం. మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రెండోసారి ఛాన్స్ లభించనుంది. ఈ మేరకు తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయం సుఖేందర్ రెడ్డికి ఓకే చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

9 నెలలుగా ఖాళీ

శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు తొమ్మిది నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఇద్దరూ గత ఏడాది జూన్ మూడో తేదీన పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అయితే మండలిలో వారితో పాటు చాలామంది సభ్యులు రిటైర్ కావడం.. వాటి భర్తీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. ప్రొటెం చైర్మన్ గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించగా ఆయన కూడా జనవరి నాలుగో తేదీన రిటైర్ అయ్యారు. దాంతో ఎమ్ఐఎమ్ సభ్యుడు అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్ గా నియమించారు. మరోవైపు మండలిలో ఖాళీగా ఉన్న 21 స్థానాలకు ఎన్నికలు పూర్తికావడం, కొత్త సభ్యులు రావడంతో చైర్మన్ ఎన్నికకు ముహూర్తం నిర్ణయించారు. శాసనమండలి మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా తెరాసకు 36 మంది సభ్యులు ఉన్నారు. దాంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆ పార్టీకే దక్కుతాయి.

ముగ్గురి పేర్ల పరిశీలన

మండలి చైర్మన్ పదవికోసం పలువురు ప్రయత్నించారు. అయితే తెరాస అధినేత ప్రధానంగా ముగ్గురి పేర్లు పరిశీలించారు. ఎమ్మెల్యే కోటాలో మళ్లీ ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రి కడియం శ్రీహరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే చివరికి గుత్తాకే మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఇటీవలే గుత్తా కేసీఆర్ ను కలిసి మాట్లాడిన తర్వాత ఆయన పేరు ఖాయం అయ్యింది. అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి మొదటి నుంచి బండ ప్రకాష్ పేరు వినిపిస్తుండగా.. అదే ఖరారు అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను కేసీఆర్ రాజీనామా చేయించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఓసీలకు చైర్మన్, బీసీ వర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.