iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలామందిలో మొన్నటి ఎన్నికల ఫలితాలకు ముందు ఓ దింపుడు కళ్లం ఆశ ఉండేది. పసుపు-కుంకుమ పథకం ఫలితాన్నిచ్చిందని చివరి వరకూ భావించారు. ముఖ్యంగా పోలింగ్ గడువు ముగిసిన తర్వాత కూడా మహిళలు చాలామంది పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓట్లువేసి రావడం చూసిన వారిలో అలాంటి ఆశలు కనిపించాయి. కానీ తీరా ఈవీఎంలు ఓపెన్ కాగానే అలాంటి ఆశలన్నీ అడియాశలయ్యాయి. నమ్మకాలు పటాపంచలయ్యాయి. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల మహిళలు, మగవారనే బేధం లేకుండా అన్ని తరగతులు వైఎస్సార్సీపీకి జై కొట్టాయి. జగన్ కి జైజైలు పలకడంతో రికార్డు స్థాయి ఫలితాలు నమోదయ్యాయి.
అప్పటివరకూ తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల గంపెడాశలు ఉండేవి. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు కూడా తానే పెట్టానంటూ చంద్రబాబు చేసిన ప్రచారం నమ్మి తమ వెంట నడుస్తారనే ధీమా కనిపించేది నిజానికి స్వయం శక్తి సంఘాలు అనేవి ఇండియాలో 1986-87లో పురుడు పోసుకున్నాయి. ఆనాటికి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. అంతకుముందే బంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకు స్థాపించి మహ్మద్ యూనిస్ సారధ్యంలో స్థానిక మహిళలతో ఇలాంటి గ్రూపులు ఏర్పాటయ్యాయి. వాటి పలితాలను చూసిన తర్వాత దేశంలో స్వయంశక్తి సంఘాలు ప్రారంభించారు. ఏపీలో కూడా 1989లోనే తొలి సంఘం ఏర్పాటయ్యింది. ఆనాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా కనీసం మంత్రిగానూ పనిచేయడం లేదు.
చంద్రబాబుకి సంబంధం లేకుండానే 1992లో సారా వ్యతిరేకోద్యమ కాలంలో డ్వాక్రా సంఘాలు విస్తరించాయి. పలు చోట్ల మహిళలు స్వచ్ఛందంగా స్వయంశక్తి సంఘాలు స్థాపించారు. 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకోవడానికి సిగ్గుపడని చంద్రబాబు డ్వాక్రా సంఘాల సృష్టికర్తనంటూ కూడా చెప్పుకున్నారు. వాటిని కొంతకాలం మహిళలు నమ్మి టీడీపీ వెంట నడిచారు. కానీ 2019లో జగన్ ని ఆదరించారు. అందుకు అనుగుణంగా మూడేళ్లు నిండకుండానే 1లక్షా 20వేల కోట్ల రూపాయల ప్రయోజనం మహిళలకు నేరుగా దక్కింది. ఏడాదికి రూ.40వేల కోట్ల చొప్పున ఏపీలో మహిళలకు జగన్ అందించారు. వివిధ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో ఈ మొత్తం చేరడంతో రాష్ట్రంలో మహిళలు సంతృప్తిగా ఉన్నారు. జగన్ పట్ల ఆదరాభిమానాలు కొనసాగిస్తున్నారు.
మహిళలను తానే చైతన్య పరిచానంటూ చంద్రబాబు చెప్పుకుంటున్న మాటలను కొన్నాళ్లు విశ్వసించి భంగపడ్డ వారంతా ప్రస్తుతం టీడీపీ మొఖం చూడడం లేదు. ఆపార్టీని ఆదరించేందుకు ససేమీరా అంటున్నారు. చివరకు మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమం వెలవెలబోగా, జగన్ హాజరయిన కార్యక్రమం సందడిగా సాగడం అందుకు ఓ సాక్ష్యంగా ఉంది. టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సైతం మహిళలు నిస్తేజంగా కనిపించగా, విజయవాడ మునిసిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి హాజరయిన కార్యక్రమం ఉత్సాహపూరితంగా సాగింది. దాంతో మహిళలు టీడీపీకి దాదాపుగా దూరమయినట్టు రూఢీ అవుతోంది. జగన్ మరింత బలపడేందుకు మహిళల తోడ్పాటు అనివార్యంగా ఈరోజు కనిపించిన వాతావరణం సాక్ష్యాత్కరించింది.