iDreamPost
android-app
ios-app

రాజీనామా కోర్టులో ఆమోదిస్తారా.. గంటా, ఏంటో ఈ తహతహ

  • Published Mar 27, 2022 | 6:24 PM Updated Updated Mar 27, 2022 | 8:31 PM
రాజీనామా కోర్టులో ఆమోదిస్తారా.. గంటా, ఏంటో ఈ తహతహ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. ఆయన ఇప్పటివరకూ ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు బరిలో దిగిన దాఖలాలు లేవు. 2014,19కి వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే టికెట్ పై పోటీ చేసిన చరిత్ర కూడా లేదు. అలాంటి నాయకుడికి వచ్చే ఎన్నికల గురించి బెంగ పట్టుకుంది. మరోసారి విజయం సాధించేందుకు ఢోకా లేకుండా చేసుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకు ధీమా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన కన్ను గాజువాక అసెంబ్లీ సీటు మీద ఉందనే ప్రచారం సాగుతోంది.

రాజకీయంగా గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం అధికారంలో ఉండగా క్రియాశీలకంగా వ్యవహరించారు. భారీగా భూఆక్రమణలు సహా వ్యవహారాలు చక్కబెట్టారు. సొంత పార్టీకి చెందిన అయ్యన్నపాత్రుడు వంటివారే తీవ్రంగా విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. అలాంటి గంటా మొన్నటి ఎన్నికల్లో భీమిలిని వదిలేసి విశాఖ నగరంలో అడుగుపెట్టారు. విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. కానీ గెలిచిన నాటి నుంచి టీడీపీకి హ్యాండిచ్చారు. అధికారం కోల్పోవడమే కాకుండా, ఘోరంగా దెబ్బతిన్న పార్టీని నమ్ముకుంటే తన లక్ష్యం దెబ్బతింటుందనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో టీడీపీని దూరం పెట్టేశారు.

అదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలుకాగానే ఆయన అనూహ్యంగా అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నెలలు ఆగి రాజీనామా సమర్పించారు. అయితే ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. ఇప్పుడు తన రాజీనామా ఆమోదించాలని కోర్టుకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నట్టు ఆయన మీడియాకు లీకులిస్తున్నారు. కానీ నిజంగా కోర్టుకి వెళ్లే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా అన్నది అనుమానమే. ఒకవేళ నిజంగా కోర్టులో పిటీషన్ వేసినప్పటికీ మళ్లీ అది స్పీకర్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి తన రాజీనామా ఆమోదం కోసం స్పీకర్ ని కలిసి విన్నవించకుండా కోర్టులంటూ కొత్త రాగం అందుకోవడం గంటా వ్యూహంగానే ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

గాజువాక అసెంబ్లీ స్థానంలో కాపుల సంఖ్య ఎక్కువ. పైగా గతంలో ప్రజారాజ్యం గెలిచిన సీట్లలో అది ఒకటి. అదే సమయంలో పారిశ్రామిక కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రభావితం చేసే ఫోర్స్ గా ఉంటారు. కాబట్టి విశాఖ ఉక్కు చుట్టూ ఇలాంటి హంగామా సృష్టిస్తే రాజీనామా ఆమోదం పొంది, విశాఖ నార్త్ లో ఉప ఎన్నికలు వచ్చినా రాకున్నా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు గాజువాకలో త్యాగం చేసిన నాయకుడిగా ఢోకా ఉండదనే అంచనాకు ఆయన వచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ దృష్టి ఈసారి తూర్పుగోదావరి జిల్లా మీద ఉండడంతో తనకు లైన్ క్లియర్ గా ఉంటుందనే అంచనాలో గంటా ఉన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో గాజువాక సీటు తనకు కేటాయిస్తే మరోసారి సేఫ్ గా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చేస్తుందనే లెక్కల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి సంఘీభావంగా కార్యాచరణలో కనిపించని గంటా ఏకంగా రాజీనామా అంటూ కోర్టు గుమ్మం ఎక్కే యత్నాలు చేయడాన్ని చూడాల్సి ఉంటుంది.