iDreamPost
iDreamPost
ఏడాది క్రితం రాజీనామా చేశాను. అది నేటికీ మీ పరిశీలనలోనే ఉంది. దాన్ని వెంటనే ఆమోదించండి.. అంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. చాలాకాలంగా అసెంబ్లీకి హాజరుకాని గంటా ఈ సమావేశాలకు కూడా రాకుండా లేఖ ద్వారా స్పీకరుకు తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటులో వంద శాతం వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు ఏడాదికి పైగా ఉద్యమం నిర్వహిస్తున్నారు. దానికి సంఘీభావంగా గత ఏడాది ఫిబ్రవరి 12న గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకరుకు లేఖ రాశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో..
గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమిపాలైనా గంటా మాత్రం విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పటినుంచీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రారంభం అయిన తొలినాళ్లలోనే పార్టీతో సంప్రదించకుండా ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అక్కడికక్కడే లేఖ రాశారు. అయితే అది స్పీకర్ ఫార్మాట్లో లేనందున ఆమోదం పొందదని, ఇదంతా గంటా డ్రామా అని విమర్శలు రావడంతో మళ్లీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి పంపారు. కొద్ది నెలల తర్వాత ఆమదాలవలస వెళ్లి స్పీకరును స్వయంగా కలిసి రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ ఇప్పటికీ స్పీకర్ కార్యాలయ పరిశీలనలోనే ఉంది. కాగా ఉక్కు ప్రైవేటీకరణ చర్యలు ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఆస్తుల మదించి విలువ కట్టే సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఉద్యమాన్ని మరింత తీవ్రంచేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో గంటా కూడా తన రాజీనామా అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. గతంలోనే స్వయంగా కలిసి ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసినట్లు వివరించానని, అయినా ఇప్పటికీ ఆమోదించలేదని స్పీకరుకు రాసిన లేఖలో గంటా ప్రస్తావించారు. తక్షణం ఆమోదం తెలపాలని కోరారు.
వ్యక్తిగత మైలేజ్ కోసమే..
టీడీపీకి దూరంగా ఉన్న గంటా వేరే పార్టీల్లో చేరుతారని ప్రచారం జరుగుతున్నా అవేవీ వాస్తవం కాలేదు. ఇటీవల అధినేత చంద్రబాబుతో చర్చలకు తాడేపల్లి కార్యాలయానికి రావాలని పార్టీ కోరినా వెళ్లలేదు. మరోవైపు కాపు సామాజికవర్గ అభ్యున్నతి పేరుతో విశాఖ, హైదరాబాద్, విజయవాడల్లో జరిగిన ఆ సామాజికవర్గ ప్రముఖులతో జరిగిన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వారంతా కలిసి ఫోరం ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో తన రాజీనామా అంశాన్ని గంటా మళ్లీ తెరపైకి తీసుకురావడం చూస్తే సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ఆయన వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.