iDreamPost
android-app
ios-app

నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. గెలిచేదెవ్వరు..?

నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. గెలిచేదెవ్వరు..?

దాదాపు రెండు నెలలపాటు జరిగిన మినీ ఎన్నికల సంగ్రామం తుది దశకు వచ్చింది. ఈ రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. పటిష్టమైన భద్రత మధ్య, కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్‌ చేపట్టనున్నారు. మధ్యాహ్నం కల్లా ఆయా రాష్ట్రాలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలిసిపోతుంది.

జనవరి 14వ తేదీన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మిజోరం, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తి చేయగా.. మిజోరంలో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. ఈ ప్రక్రియ ఈ నెల 7వ తేదీతో ముగిసింది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీలు హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్‌ కూడా పూర్వవైభవం కోసం శాయశక్తులా కృషి చేసింది. బీఎస్పీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలలో బీజేపీకే మళ్లీ అధికారం దక్కబోతోందని వెల్లడైంది. అన్ని మీడియా, సర్వే సంస్థలు బీజేపీనే గెలవబోతోందని అంచనా వేశాయి. 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 202 సీట్లు కావాలి. అన్ని సర్వే సంస్థల ఫలితాల్లో బీజేపీకి 225 నుంచి 294 మధ్య సీట్లు వస్తాయని వెల్లడైంది. సమాజ్‌వాదీ పార్టీకి 70–150 మధ్య సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.

పంజాబ్‌లో ఈ సారి కొత్త పార్టీకి అవకాశం దక్కబోతోందని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అంచనా వేశాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో మేజిక్‌ ఫిగర్‌ 59 సీట్లు. దాదాపు అన్ని సర్వే సంస్థలు.. పంజాబ్‌ ప్రజలు ఆప్‌కే పట్టం కట్టబోతున్నారని అంచనా వేశాయి. 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం దక్కబోతోందని పేర్కొన్నాయి. మేజిక్‌ ఫిగర్‌ 36 సీట్లు కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేశాయి. స్వల్ప మెజారిటీతో బీజేపీనే గెలవబోతోందని పేర్కొన్నాయి.

60 సీట్లు ఉన్న మణిపూర్‌లో మేజిక్‌ ఫిగర్‌ 31 సీట్లు. ఇక్కడ మళ్లీ బీజేపీనే స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. 40 స్థానాలు ఉన్న గోవాలో మేజిక్‌ ఫిగర్‌ 21 సీట్లు కాగా.. ఇక్కడ హంగ్‌ ఏర్పడుతుందని అంచనా వేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌లో 15 సీట్ల చొప్పన గెలుచుకుంటాయని, టీఎంసీ 5–10 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు కట్టాయి. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ కీలకం కానుంది. గోవాలో తొలిసారి టీఎంసీ పోటీ చేసింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. హంగ్‌ వస్తే.. టీఎంసీతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.