iDreamPost
android-app
ios-app

త‌ప్పుడు ప్ర‌చారాల‌పై మండిప‌డ్డ ఏపీ మాజీ మంత్రి

త‌ప్పుడు ప్ర‌చారాల‌పై మండిప‌డ్డ ఏపీ మాజీ మంత్రి

మా వైసీపీ నేత‌ల కమిట్మెంట్ ప్ర‌త్య‌ర్థుల‌కు, ఎల్లో మీడియాకు కంట్లో న‌లుసుగా మారింది. అది చూసి ఓర్వ‌లేక ఏదేదో ప్ర‌చారం చేస్తున్నారు. వార్తలు అల్లుతున్నారు.ప్ర‌భుత్వంపైనా, మా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైనా బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు… అంటూ కొంద‌రు మాజీమంత్రులు,ఎమ్మెల్యేలు ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ప్పుడు వార్త‌ల‌ను ఖండిస్తూ మీడియా ముందుకు వ‌స్తున్నారు. మంగ‌ళ‌వారం మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాద‌వ్ దుష్ప్ర‌చారాల‌పై స్పందించారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఏపీలో లేక‌పోయాన‌ని, అందువ‌ల్ల ప్ర‌మాణస్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్ల‌లేక‌పోతే వ్య‌తిరేక వార్త‌లు ప్ర‌సారం చేశార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా ప్ర‌త్య‌ర్థుల‌పై మండిపడ్డారు.

తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని సుచరిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్‌లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్‌ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు.

కేబినెట్‌ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్‌ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వాస్త‌వ విరుద్ధ‌మైన వార్త‌ల‌ను ప్ర‌సారం చేసి పార్టీ శ్రేణుల‌ను, ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్ట‌వ‌ద్ద‌ని మీడియాను కోరారు.