Idream media
Idream media
శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో చెలరేగిన హింసకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. వేరే రాష్ట్రంలో జరిగిన ఘటనకు, ఖర్గోన్ హింసాకాండకు ముడిపెడుతూ ట్విట్టర్‌లో ఆయన ఫోటో పోస్టు చేయడంపై అక్కడి బీజేపీ ప్రభుత్వం మండిపడింది. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఖర్గోన్ పట్టణంలో నవమి ఊరేగింపుపై ఆదివారం సాయంత్రం కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనలు చెలరేగి హింసాత్మకంగా మారింది. వాహనాలు, ఇళ్ల దహనాలు కూడా జరిగాయి. దీంతో పట్టణమంతా కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఓ మసీదుపై కొందరు యువకులు కాషాయ జెండాను ఎగురవేస్తున్న ఫోటోను దిగ్విజయ్ సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
అలాగే బీజేపీ నేత కపిల్ మిశ్రా వ్యాఖ్యల వీడియోను కూడా పోస్టుచేశారు. ఆదివారం ఖర్గోన్‌లో మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, యంత్రాంగం ఏం చేస్తోందని దిగ్విజయ్ నిలదీశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రస్తావిస్తూ హిందువులు తమ గుర్తింపును కాపాడుకోవాలని మిశ్రా చేసిన ప్రసంగం వీడియోలో ఉంది. ‘కత్తులు, కర్రలు పట్టుకుని ఓ ప్రార్థనా స్థలంపై జెండా ఎగురవేయడం సముచితమేనా? ఆయుధాలతో ఊరేగింపును ఖర్గోన్ యంత్రాంగం అనుమతించిందా? మరి మతాలతో సంబంధం లేకుండా రాళ్లు రువ్వినవారి ఇళ్లపైకి బుల్డోజర్లను నడుపుతారా? నిష్పక్షపాతంగా ప్రభుత్వాన్ని నడుపుతానని ప్రమాణం చేసిన మాట మరవొద్దు’ అని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఉద్దేశించి దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
దీనిపై భోపాల్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ సహా కొందరు బీజేపీ నేతలు ఆరా తీశారు. ఖర్గోన్ హింసాకాండను ఆ ఫోటోకు ముడిపెట్టడంపై అభ్యంతరం తెలిపారు. అది బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోదని కొందరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై దుమారం రేగడంతో దిగ్విజయ్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ఆయన కుట్రపన్నారని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం ఆరోపించారు. మసీదుపై జెండా ఎగురవేసిన ఫోటో మధ్యప్రదేశ్‌ది కాదని.. ఆయనపై చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. మతం, జాతులు, పుట్టుక ఆధారంగా వివిధ వర్గాల నడుమ శత్రుత్వం రగిల్చే కుట్ర, మత ఉద్రిక్తతలను కావాలని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం, ఫోర్జరీ వంటి అభియోగాలతో క్రైం బ్రాంచ్ పోలీసులు దిగ్విజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ, 465, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీసు కమిషనర్ మకరంద్ దౌస్కర్ వెల్లడించారు.