iDreamPost
android-app
ios-app

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. అరుదైన రికార్డులు..

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు..  అరుదైన రికార్డులు..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త మంత్రివ‌ర్గ కూర్పు ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సంత‌రించుకుంది. సామాజికన్యాయం ప‌రంగానే కాదు.. కొత్త మంత్రుల్లో కొంద‌రు తాజా ప‌ద‌వి పొంద‌డం ద్వారా త‌మ రాజ‌కీయ జీవితంలో కొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. వారిలో ఒక‌రు.. కొత్త‌ రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయ‌న సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న‌కు గ‌తంలో కూడా రెవెన్యూ మంత్రిగా చేసిన అనుభ‌వం ఉంది. అంతేకాదు.. మంత్రిగానే అపార అనుభ‌వం ఆయ‌న సొంతం.

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రాజ‌కీయ ప్ర‌స్థానం సుదీర్ఘ‌మైన‌ది. అందులో మంత్రిగానే ప‌ద‌మూడేళ్లు కొన‌సాగారు. శ్రీ‌కాకుళం జిల్లాలో ఆ ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింది. తాజాగా మ‌రోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు దక్కడంతో ఆయన సీనియారిటీ మరింత పెరగనుంది. అంతేకాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత ధర్మానకు దక్కింది. రెవెన్యూ మంత్రిగా మూడోసారి పనిచేసిన గౌరవం కూడా ధర్మాన ప్రసాదరావుకే లభించింది.

ఇదీ ప్ర‌స్థానం

1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాజ‌కీయ జీవితంలోకి అడుగుపెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 1989లో ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు తొలిసారి మంత్రిగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో కూడా మంత్రి అయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్‌ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణానంతరం ఏర్పడిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పోస్టు దక్కింది.

2004 నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013 లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో మంత్రిపదవి పొందారు. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనతే కాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం కూడా ధర్మానకే దక్కింది. నేదురుమల్లి జనార్దనరెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వరకు ఆరుగురి వద్ద పనిచేసిన మంత్రిగా రికార్డుకెక్కారు. ఇక రెవెన్యూ శాఖనైతే మూడు సార్లు చేపట్టారు. శ్రీ‌కాకుళం జిల్లాలో అత్యధికకాలం (13 ఏళ్లు) మంత్రిగా పనిచేసిన ఘనత ధర్మాన ప్రసాదరావుకు దక్కగా, అత్యల్ప కాలం(31రోజులు) మంత్రిగా పనిచేసిన ఘనత తంగి సత్యనారాయణకు దక్కింది. నాదెండ్ల భాస్కరరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా అతి తక్కువ రోజులు పని చేశారు.