iDreamPost
android-app
ios-app

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి సొంతింటి నుంచే పోటీ

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి సొంతింటి నుంచే పోటీ

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఆమె మీడియాకు సమాచారం అందించారు. టీడీపీలో చేరిన తర్వాత తన తదుపరి కార్యాచరణ వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి పుష్ప శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవి రాజు స్వయానా చెల్లెలు. ఆమె తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజు అప్పట్లో ‘నాగూరు’గా ఉండే స్థానం నుంచి 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అది కురుపాం నియోజకవర్గంగా ఏర్పాటు చేయగా ఆయన మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరారు. 2014లో ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అనూహ్యంగా చంద్రశేఖరరాజు 2018 లో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున తన కుమార్తె పల్లవికి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే టీడీపీ నుంచి మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్‌ కు టికెట్ ఇవ్వడంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరారు. 2019లో పుష్ప శ్రీవాణి మళ్లీ గెలుపొందగా జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. అయితే ఆయన వైసీపీ ప్రభుత్వంపై అడపాదడపా గతంలో లాగే విమర్శలు చేశారు.

అంతేకాక 2021లో పార్టీకి రాజీనామా చేశారు. అయితే జనార్దన్ థాట్రాజ్‌ 2020లో మరణించడంతో టీడీపీ నుంచి ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉందని భావించి ఇప్పుడు పల్లవి రాజును రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అనారోగ్య పరిస్థితుల కారణంగా శత్రుచర్ల పల్లవి రాజ్ ను తన వారసురాలిగా రంగంలోకి దింపుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో పల్లవి మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో గిరిజన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నానని ఆమె వెల్లడించారు. కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని, పాము కాటుకు గురైన విద్యార్థులను పట్టించుకోలేదని ఆమె అన్నారు. గిరిజనుల సమస్యలే ప్రధాన అజెండాగా పోరాడుతానని వెల్లడించారు.