iDreamPost
android-app
ios-app

సమస్య సృష్టించి, గగ్గోలు పెట్టడమే అలవాటుగా మార్చుకున్న టీడీపీ

  • Published Mar 21, 2022 | 8:12 AM Updated Updated Mar 21, 2022 | 8:42 AM
సమస్య సృష్టించి, గగ్గోలు పెట్టడమే అలవాటుగా మార్చుకున్న టీడీపీ

చంద్రబాబు నెలరోజుల క్రితం ఓ వ్యాఖ్య చేశారు. ఏపీ సీఎం జగన్ తానే సమస్యను సృష్టించి, పరిష్కరించినట్టు చెప్పుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు. కానీ తీరా ఇప్పుడు టీడీపీ తీరు చూస్తుంటే తాము సమస్య ఉన్నట్టు సృష్టించడం, దాని చుట్టూ గగ్గోలు పెట్టడం అలవాటుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ వారమంతా మద్యం చుట్టూ ఆపార్టీ రాద్ధాంతం చేసింది. స్వయంగా చంద్రబాబు జంగారెడ్డిగూడెం వెళ్లారు. 15 మంది చనిపోయారంటూ విమర్శించారు. ఏపీ అసెంబ్లీకి వచ్చేసరికి ఆపార్టీ నేతలు రోజురోజుకీ సంఖ్య పెంచుతూ 27మంది అంటూ మాట్లాడారు. చివరకు మృతులు 40మంది అంటూ తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మండలి బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇలా తలో మాట మాట్లాడుతూ అసలు వాస్తవాన్ని కప్పిపుచ్చే పనిలో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. జనాలను ఈ అంకెల గారడీతో మభ్యపెట్టవచ్చని భావించినట్టు స్పష్టమవుతోంది.

జంగారెడ్డిగూడెం మృతుల వ్యవహారం ఫలించినట్టు కనిపించలేదు. దాంతో కొత్త డ్రామాకి తెరలేపి జే బ్రాండ్లు అంటూ మరో రాగం అందుకున్నారు. తాను అనుమతించిన బ్రాండ్లనే ఏపీలో అమ్ముతున్నారనే విషయాన్ని మరుగునపరిచి, కొత్తగా బ్రాండ్లు వచ్చినట్టు, అవన్నీ కల్తీవన్నట్టుగా చంద్రబాబు సూత్రీకరించే పనిలో పడ్డారు. పచ్చ మీడియా సహాయంతో ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని భావిస్తున్నారు. అధికారం చేజారిపోయే ముందు చివరి రోజుల్లో చంద్రబాబు అనుమతించిన బ్రాండ్లనే ఇప్పటికీ అమ్ముతున్నప్పటికీ నానా హంగామా మాత్రం ఆపలేదు. 2020 తర్వాత కొత్త బ్రాండ్లకు అనుమతి లేదని అధికారికంగా ధృవీకరించినా అబద్ధాల ప్రచారంతో వీధి వీధినా లిక్కర్ రగడ లేపారు. తద్వారా తన మూలంగానే సమస్య ఏర్పడితే దానిని కూడా జగన్ మెడకు చుట్టాలనే యత్నంలో చంద్రబాబు ఉన్నట్టు చాటుకుంటున్నారు.

అసెంబ్లీలో వారంరోజుల పాటు మద్యం కథ నడిపిన టీడీపీ చివరకు ఒక్క చిన్న ఆధారం కూడా చూపించలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ మృతుల సంఖ్య పెంచుకుంటూ పోవడమే తప్ప ప్రజలముందు ఆధారాలుంచి ప్రభుత్వాన్ని నిలదీయాలనే విషయాన్ని విస్మరించారు. ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టించవచ్చని అనుకోవడమే తప్ప తమ వాదనలో అసలు పసలేదనే విషయాన్ని వదిలేస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికల అంచనాతో ఉన్న టీడీపీ తాజాగా నిత్యం ఏదో ఓ విషయాన్ని వివాదంగా మార్చేసి పబ్బం గడుపుకునే లక్ష్యంతో ఉన్నట్టు ఈ పరిణామాలు చాటుతున్నాయి. వాటిని ప్రభుత్వం తగిన వ్యూహంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదంటే వాటినే నిజాలని నమ్మించే శక్తి నారా యంత్రాంగానికి ఉందనే విషయం విస్మరించరానిది.