Dharani
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. మరి ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. మరి ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..
Dharani
చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లో.. బాగా గుర్తిండిపోయే పాత్ర.. రాజా విక్రమార్కుడు. శ్మశానంలోకి వెళ్లి బేతాళుడిని భుజం మీద వేసుకుని.. మౌనంగా ముందుకుసాగుతాడు. బేతాళుడి అడిగే యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.. అనంతరం ఆ శవం తిరిగి చెట్టు మీదకు వెళ్లడం. నిరంతరం ఇదే ప్రక్రియ. అయినా సరే విక్రమార్కుడు.. ఏమాత్రం నిరాశ పడకుండా ఆయశ సాధన కోసం ముందుకు సాగుతూనే ఉంటాడు. నాటి విక్రమార్కుడి స్ఫూర్తితో నేటి రాజకీయాల్లో అలానే పట్టు వదలకుండా ముందుకు సాగి.. జవసత్వాలు ఊడి.. సమాధి స్థితికి చేరిన పార్టీని.. పట్టుబట్టి అధికారంలోకి తీసుకువచ్చి.. అభినవ విక్రమార్కుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క.
సీఎల్పీ నేతగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనదైన పాత్ర పోషించారు భట్టి విక్రమార్క. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచి.. పీపుల్స్ మార్చ్ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తామున్నామన్న భరోసా ఇచ్చారు. ఆయన పాదయాత్రతో అటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని పెచటంతో పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపారు భట్టి విక్రమార్క. భట్టితో పాటు కాంగ్రెస్ నేతల కృషి వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. హస్తం పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు కొత్త మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఇక నేడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క వ్యక్తిగత జీవితం, పొలిటికల్ కెరీర్ కు సంబంధించిన వివరాలు మీకోసం..
భట్టి విక్రమార్క స్వస్థలం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురం. మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి 1986లో ఎంఏ (చరిత్ర) పీజీ పూర్తి చేశారు. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా.. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు.
మల్లు భట్టి విక్రమార్కది ముందు నుంచీ రాజకీయ కుటుంబమే. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క కంటే ముందే.. ఆయన సోదరులైన మల్లు అనంత రాములు, మల్లు రవి రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. పైగా ముందు నుంచి వారి ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. మల్లు అనంత రాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
అనంతరాములు 1980, 1989లలో మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో.. మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం.. జడ్చర్ల నుంచి మల్లు రవి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సోదరుడు మల్లు అనంత రాములు మరణం తర్వాతే భట్టి విక్రమార్క రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ హయాంలో చురుగ్గా పని చేశారు. ముందుగా భట్టి పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా 1990-92 వరకు పని చేశారు. ఆ తర్వాత 2000-2003 వరకు పీసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి.. ఆ ఏడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
అప్పటివరకు సీపీఐ(ఎం) కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా.. 2023లోనూ విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్‌గా కూడా పని చేశారు భట్టి. అలానే 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా భట్టి ఎన్నికయ్యారు. ఇక 2023 ఎన్నికల్లో మరోసారి మధిర నుంచి గెలిచి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
సీఎల్పీ నేతగా.. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేశారు. భట్టి సుదీర్ఘ పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను ఆవిష్కరించి ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2023 జులై 2న రాహుల్ గాంధీ ముఖ్యఅతిధిగా జన గర్జన సభను నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు భట్టి.
భట్టి గట్టిగా పట్టుబడితే.. సీఎం పదవి తనని వరించేది. కానీ ఆయన అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరించి.. పదవులు కన్నా పార్టీనే ముఖ్యమని నమ్మారు. అందుకే రేవంత్ ని సీఎంగా ప్రకటిస్తే.. తన మద్దతు ప్రకటించి.. మరోసారి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు. కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నియమితులైన భట్టికి అభినందనలు తెలుపుతున్నారు అభిమానులు.