iDreamPost
android-app
ios-app

Congress Manifesto: కాంగ్రెస్ మ్యానిఫెస్టో పూర్తి వివరాలతో! ఇవన్నీ చేస్తే సూపర్!

  • Published Dec 05, 2023 | 1:42 PM Updated Updated Dec 05, 2023 | 1:42 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే.. ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలు మొత్తం అమలు అయితే అద్భుతంగా ఉంటుంది. అసలింతకీ ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే.. ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలు మొత్తం అమలు అయితే అద్భుతంగా ఉంటుంది. అసలింతకీ ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 05, 2023 | 1:42 PMUpdated Dec 05, 2023 | 1:42 PM
Congress Manifesto: కాంగ్రెస్ మ్యానిఫెస్టో పూర్తి వివరాలతో! ఇవన్నీ చేస్తే సూపర్!

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి ఘన విజయం సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి.. కాంగ్రెస్‌ అధికారం దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్‌.. ఓ ఆరు గ్యారెంటీల పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ గ్యారెంటీలే కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి స్కీములను కాంగ్రెస్‌ పార్టీ మేనిఫేస్టోలో పేర్కొంది. అలాగే వాటిలో ఆరు గ్యారెంటీల పేరుతో కొన్ని అంశాలను హైలెట్‌ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఆ ఆరు గ్యారెంటీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ముఖ్యంగా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటిది.. మహాలక్ష్మి. ఈ పథకం కింద తెలంగాణలోని ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే ప్రతి ఇంటికీ.. కేవలం రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్‌ ధర గుదిబండలా మారింది. ఒక సిలిండర్‌కు వెయ్యి పైనే చెల్లిస్తున్నారు.. వారందరికీ కేవలం 500 రుపాయలకే సిలిండర్‌ రావడం భారీ ఊరటను ఇచ్చే అంశం. ఈ రెండు స్కీములతో పాటు.. మరో ముఖ్యమైన స్కీమ్‌ కూడా మహాలక్ష్మి పథకంలో ఉంది. అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. మహిళలు టిక్కెటుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ స్కీమ్‌ ఎంతో ఉపయోగపడనుంది.

రెండో గ్యారెంటీ రైతు భరోసా.. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పూర్తిగా మహిళలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తే.. రెండు గ్యారెంటీ అయిన రైతు భరోసా దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం రూపొందించారు. ఈ రైతు భరోసా గ్యారెంటీలో భాగంగా.. భూమి ఉన్న రైతులకు, కౌలుకు భూమి సాగు చేస్తున్న రైతులకు ప్రతి ఏడాది రూ.15 వేలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించనుంది. వీరితో పాటు వ్యవసాయ రంగంలో తమ చెమటను చిందించే వ్యవసాయ కూలీలతో పాటు, భూమిలేని నిరుపేదలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇవ్వనున్నారు.

ఇక మూడో గ్యారెంటీ పేరు గృహ జ్యోతి.. ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయనున్నారు. 200లకి మించితే కరెంట్‌ బిల్లు కట్టాల్సి ఉంటుంది. నాలుగో గ్యారెంటీ పేరు.. ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పథకాన్ని మరింత మెరుగ్గా చేపట్టేందుకు.. రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటిస్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నారు.

ఇక ఐదో గ్యారెంటీ యువ వికాసం గురించి మాట్లాడుకుంటే.. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. యువ వికాసం కింద.. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల వ్యయ పరిమితితో విద్య భరోసా కార్డుల అందజేస్తారు. వడ్డీ లేకుండా ఆర్ధిక సహాయక కార్డులు ఇచ్చి.. కాలేజీ ఫీజులు, కోచింగ్‌ ఫీజులు, విదేశీ విద్య ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌ కొనుగోలు, హాస్టల్‌ ఫీజులు, ల్యాప్‌టాప్‌, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు ఇలా విద్యకు సంబంధించి ఏ అవసరం ఉన్నా.. ఆ కార్డు నుంచి చెల్లింపులు చేయవచ్చు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

ఇక చివరిదైన చేయూత గ్యారెంటీ విషయానికి వస్తే.. ఈ పథకంలో భాగంగా.. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు, ఎయిడ్స్‌, ఫైలేరియా బాధితులకు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధి గ్రస్థులకు పించన్లు అందించనున్నారు. అలాగే.. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నారు. ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మరికొన్ని అంశాలపై కూడా కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా వివరంగా పేర్కొంది. మొత్తం 42 పేజీల మేనిఫెస్టో రూపొందించింది. అందులో 62 అంశాలను విడివిడిగా వివరించింది. అవి వరుసగా ఇలా ఉన్నాయి..

Congress manifesto full details

నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఏబీసీడీ వర్గీకరణ, బెల్ట్ షాపుల రద్దు, తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేల గౌరవ భృతి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు 3 లక్షల వడ్డీ లేని పంట రుణం, కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, చెరువుల నిర్వాహణ‌, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత, తొలి క్యాబినెట్‌లో మెగా డీఏస్సీ ప్రకటన, రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్, విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు చేస్తామని పేర్కొన్నాడు.

అలాగే ధరణి పోర్టల్‌ స్థానంలో భూమాత పోర్టల్, రేషన్ ద్వారా సన్న బియ్యం, రేషన్ డీలర్‌లకు రూ.5 వేల గౌరవ భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, ప్రభుత్వంలో ఆర్టీసీ వీలీన పక్రియ పూర్తి చేస్తాం, ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం అందజేత, మహిళా సంఘాలకు పావులా వడ్డీకే రుణాలు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి, 100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం, ఎన్నారైల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు అందజేత. ఇందులో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, జాబ్ కేలండర్, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు కీలకమైనవిగా ఉన్నాయి. అయితే.. కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ హామీలపై ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఈ హామీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.