iDreamPost
android-app
ios-app

జగ్గారెడ్డి స‌వాల్.. రేవంత్ రెడ్డి యాక్ష‌న్..

జగ్గారెడ్డి స‌వాల్.. రేవంత్ రెడ్డి యాక్ష‌న్..

తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిప‌త్య పోరు తీవ్రస్థాయికి చేరుతోంది. స‌వాళ్లు, బెదిరింపుల‌తో రాజ‌కీయాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి షాక్ ఇచ్చేలా టీపీసీసీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. జగ్గారెడ్డికి అప్పగించిన లోక్‌సభ నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ఆ బాధ్యతలను మిగిలిన వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు అప్పగించింది. కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించిన తర్వాత అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. కార్యనిర్వాహక అధ్యక్షులైన జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, గీతారెడ్డిలకు లోక్‌సభ నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల వారీగా బాధ్యతలను కేటాయించారు.

ఇందులో భాగంగా జగ్గారెడ్డికి భువనగిరి, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ లోక్‌సభ స్థానాలు, పార్టీ అనుబంధ సంఘాలైన మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, అసంఘటిత కార్మికుల సెల్‌ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. అసమ్మతిపై టీపీసీసీ పరిధిలో రేవంత్‌రెడ్డి చర్యలు ప్రారంభించారు. అప్పగించిన బాధ్యతల పట్ల పనితీరును, తాను స్వతంత్రంగా ఉంటానంటూ గతంలో అధిష్టానానికి జగ్గారెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ ఆయా బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆయన స్థానంలో భువనగరి, వరంగల్‌, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను అంజన్‌కుమార్‌ యాదవ్‌కు, కరీంనగర్‌ బాధ్యతలను మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అప్పగించారు. ఐఎన్‌టీయూసీ, అసంఘటిత కార్మిక విభాగాలను అజారుద్దీన్‌కు, మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలను మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు కేటాయించారు. దీంతో జగ్గారెడ్డి ప్రస్తుతం బాధ్యతలు లేని కార్యనిర్వాహక అధ్యక్షునిగా మిగిలిపోయారు.

కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతానన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌కు విధేయుడుగా ఉంటానని, రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. తాను గెలిస్తే హీరోనని, ఇద్దరం ఓడితే జీరోలమేనన్నారు. తనను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయట పెడుతానన్నారు. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు.