Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ (యూపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజీపీ సిద్ధమైంది. బీజేపీ యూపీ రథసారధి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీలో మకాం వేశారు. ఆదివారం ప్రధాని మోడీతో దాదాపు గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్చు సహా ఇతర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఈ భేటీ తర్వాత ప్రధాని మోడీ యోగిని ఉద్దేశించి ‘‘భవిష్యత్‌లో యూపీని యోగీ సరికొత్త అభివృద్ధి శిఖరాల వైపు నడిపిస్తారు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ద్వారా యోగీకి ప్రధాని మోడీ ఫుల్ మార్కులు వేశారనుకోవచ్చు. రాష్ట్రం చిన్నదైనా, పెద్దది అయినా
అక్కడ గెలవాలని, అధికారంలో ఉంటే దాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే మోడీ, అమిత్ షా ద్వయం ఉంటుంది. ఇందుకోసం వారిద్దరూ ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునేందుకు వెనుకాడరు. ఎన్నికలకు ఏడాది ముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నించారు. యోగీ సమర్థతపై అనుమానాలతో మోడీ, అమిత్ షా ద్వయం ఈ తరహా ఆలోచన చేసింది. పదవి కాపాడుకునేందుకు యోగీ కష్టపడాల్సి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ చొరవతో మోడీ, అమిత్ షాల ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
యోగీ సారధ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. మళ్లీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ గెలుపు క్రెడిట్‌లో అధిక వాటా యోగీకే వెళుతుంది. మోడీ, అమిత్ షా సహా ఇతర అగ్రనేతలు ప్రచారంలో ఎప్పటి మాదిరిగానే హిందుత్వం, పాకిస్తాన్, జాతీయవాదం వంటి అంశాలపై మాట్లాడగా.. యోగీ మాత్రం వారికి భిన్నంగా ప్రచారం చేశారు. తాను సాగించిన పాలనను ఆయన ప్రజలకు చెప్పారు. రిపోర్ట్ కార్డు చూపించారు. శాంతిభద్రతల అంశాన్ని ప్రముఖంగా ప్రచారం చేశారు. గుండాయిజాన్ని యోగీ ఉక్కుపాదంతో అణిచివేయడం బీజేపీకి కలిసివచ్చింది. పాలన, శాంతిభద్రతలు, అభివృద్ధి.. అంశాలనే యోగీ ఎక్కువగా ప్రచారం చేశారు.
యూపీలో మళ్లీ విజయం సాధించడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందంటూ మోడీ చెప్పుకొస్తున్నారు. మూడోసారి ప్రధాని పీఠం తనదేననే నమ్మకం యూపీ విజయం ద్వారా మోడీలో కనపడుతోంది. మొత్తం మీద యోగీ విజయం సాధించారు. మోడీ అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. ఇకపై యోగీ తన పాలన తాను సజావుగా చేసుకునే అవకాశం ఉంది. ఆయన జోలికి మోడీ, అమిత్ షా ద్వయం వెళ్లే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.