ఒకప్పుడు పింఛన్లు, రేషన్ కార్డుల కోసం యుద్ధాలే జరిగేవని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జగనన్నకు చెబుదాం పేరిట హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఇది కొనసాగింపుగా ఉంటుందని తెలిపారు.
శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి. లంచాలకు తావు లేకుండా అన్ని పథకాలను పారదర్శకంగా అందిస్తున్నాం. చిన్న చిన్న కారణాలతో మిగిలిపోయిన ఎంతో మందికి లబ్ధి చేకూర్చేందుకే ఈ జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చాం. నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు అందజేశాం.పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.
బటన్ నొక్కి అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బుని జమ చేశాం. ఎక్కడా లంచం అనే మాటకు తావు లేకుండా 600 రకాల పౌర సేవలను అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం” అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముందు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు అంతా ఒక టీమ్ గా ఏర్పడతారు. వారంతా వారం రోజుల పాటు ఇంటి ఇంటికి వెళ్లి లబ్ధి అందని వారిని గుర్తిస్తారని తెలిపారు. సచివాలయాలకు వెళ్లి సర్వీస్ నెంబర్ రిజిస్టర్ చేసి టోకెన్ తీసుకుని వారికి అందజేస్తారు.
సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు నిర్వహిస్తారో తెలియజేసి.. వారి సమస్య పరిష్కరామయ్యేలా చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారని తెలిపారు. అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతున్న తీరుపై తనిఖీలు చేస్తారు. ఈ క్యాంపులు జరుగుతున్న సమయంలో కచ్చితంగా ఎమ్మెల్యేలు సందర్శించాలని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను కూడా ఇదే కార్యక్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.