iDreamPost
iDreamPost
అందరికీ గుర్తుండే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో వీడియో ఒకటి ప్రదర్శించారు సీఎం జగన్. పోలవరం సందర్శనకు వెళ్లిన కొంతమంది చంద్రబాబు భక్తులు జయము…జయము అంటూ పాడిన పాటను ప్రదర్శించి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కూడా ఆనేక సందర్భాల్లో ప్రత్యర్థుల మీద వాగ్భాణాలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ తనదైన పంథాలో సాగుతున్నారు. కానీ తాజాగా ఆయన మరో అడుగు ముందుకేశారు. గేరు మార్చి ప్రత్యర్థులను ఏకిపారేశారు. హాస్యోక్తులతో అందరినీ అలరించారు. సభలో నవ్వులు పూయించారు. ముఖ్యమంత్రి వేసిన సెటైర్లకు సభ్యులంతా నవ్వులతో ఆనందించారు. కానీ పచ్చ మీడియా పెద్ద తలకాయలు మాత్రం తల్లడిల్లిపోయి ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు.
సోషల్ మీడియా యుగంలో సెటైర్లు చాలా సందర్భోచితంగా చూస్తూ ఉంటాం. కానీ తాజాగా సీఎం అసెంబ్లీ వేదికగా వేసిన సెటైర్లు వైఎస్సార్ ని గుర్తుచేశాయి. ఆయన కూడా నవ్వుతూ ప్రత్యర్థులతో ఆడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ జగన్ మాత్రం అందుకు తగ్గట్టుగా మరింత సెటైరికల్ గా ప్రత్యర్థుల మీద సంధించిన వాగ్భాణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభలోనూ, వెలుపలా కూడా పలువురు ఆస్వాదించారు.
పోలవరం మీద జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ సందర్భంగా పచ్చ మీడియా రాతలను ఆయన ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా రాస్తున్న రాతలను తప్పుబట్టారు. అంతటితో సరిపెట్టకుండా రామోజీరావు, రాధాకృష్ణ పేర్లు ప్రస్తావించి జగన్ చేసిన వ్యాఖ్యలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీరావూ..రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నానంటూ ఆయనకు చెప్పినట్టుగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామనే అంశంపై రాతలను ఎత్తిచూపారు. ఆంధ్రజ్యోతి కథనాలను కూడా అదే రీతిలో ఖండించారు. నవ్వుతూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు మంట పుట్టిస్తాయనడంలో సందేహం లేదు. సీఎం ఈ కాలంలో ఇలాంటి సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు చాలా అభినందించదగ్గవంటూ పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం విశేషం.