iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అదినేత వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను సన్నద్ధం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు అనుగుణంగా క్యాడర్ ని కూడా సన్నద్ధం చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది. వైఎస్ జగన్ అధ్యక్షత వహించి పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు
ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే పార్టీలో పునరుత్తేజం కోసం కసరత్తులు ప్రారంభించారు. అనుబంధ సంఘాల వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు విజయసాయిరెడ్డి రంగంలో దిగారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు జనం ముందుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. విపక్షాల ప్రచారాన్ని ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం విపక్షాలతోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలను ఎదుర్కొని సాగుతోందని వ్యాఖ్యానించారు. దానిని గుర్తించి పార్టీ ఎమ్మెల్యేలంతా ఎప్పటికప్పుడు విపక్షాల విషప్రచారాన్ని ఎండగట్టాలని తెలిపారు.
సంస్థాగతంగా కొత్త జిల్లాలకు అనుగుణంగా పార్టీ కమిటీలు వేస్తామన్నారు. కొత్త అధ్యక్షులను నియమించబోతున్నట్టు తెలిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా కొత్త జిల్లాల అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తామని తెలిపారు. దానిని అందరూ బాధ్యతగా తీసుకుని ప్రజల్లో పనిచేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మే నుంచి నెలలో కనీసంగా 10 సచివాలయాలు సందర్శించాలని ఎమ్మెల్యేలందరికీ లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండ్రోజులు వెళ్లాలన్నారు. ఎమ్మెల్యేల సచివాలయాల సందర్శనకు సంబంధించి ప్రతిరోజూ నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామని సీఎం జగన్ తెలిపారు. నాయకులతో పాటుగా క్యాడర్‌ను కూడా ప్రజలకు దగ్గర చేయాలని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.