Idream media
Idream media
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎంవీఏకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే మాట్లాడడంతో ఈ సందేహాలు మొదలయ్యాయి. ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేలా కేంద్ర మంత్రి మాటలు ఉండడం ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చడంపై బీజేపీ దృష్టి పెట్టిందా..? అనే అనుమానాలు మరోసారి నెలకొన్నాయి.
2019 అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. అయితే నాలుగు ప్రధానపార్టీలకు ఆ మెజారిటీ రాలేదు. బీజేపీకి 105, శివసేనకు 56, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి 54, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. అంతకు ముందు ఐదేళ్లు బీజేపీ, శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 122 సీట్లు గెలుచుకోవడంతో 63 సీట్లు ఉన్న శివసేనతో కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగారు. అయితే 2019లో పరిస్థితి తిరగబడింది. బీజేపీకి సీట్లు తగ్గడంతో.. ముఖ్యమంత్రి పదవి పంపకంపై శివసేన పట్టుబట్టింది. చెరో రెండున్నరేళ్ల చొప్పన ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని శివసేన డిమాండ్ చేయగా.. ఆ ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకోలేదు.
ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్థత నెలకొంది. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ, ఎన్‌సీపీలో చీలిక తెచ్చేందుకు యత్నించింది. అజిత్ పవార్‌ను దగ్గరకు తీసుకుని, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అజిత్ పవార్‌పై ఉన్న కేసులను అప్పటికప్పుడు ఎత్తివేసింది. అయితే ప్రమాణస్వీకారం రోజున బీజేపీకి షాక్ తగిలింది. అజిత్ పవార్ తిరిగి తన పెదనాన్న శరద్‌పవార్ వద్దకే వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ ఆలోచనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పరిణామం తర్వాత శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహా వికాస్ అఘాడీ (వీఎంఏ) పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. సీఎం పదవి శివసేనకు ఇచ్చేలా, అధికారం మూడు పార్టీలు పంచుకునేలా ఒప్పందం జరగడంతో.. మహా రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారం దక్కించుకోలేకపోవడంతో బీజేపీ రగిలిపోతోంది. ముఖ్యంగా తన పాత మిత్రడు అయిన శివసేన పై అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఊవ్విళ్లూరుతోంది. పలుమార్లు కూటమిలోని పార్టీల మధ్య మనస్పర్థలు రాగా ప్రభుత్వం పడిపోతుందని ఆశించింది. అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండానే ఉద్ధన్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
కూటమిలోని ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. బీజేపీ నేతలు తరచూ ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా అధికార పార్టీలలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలోకి రావడం వల్ల మహారాష్ట్రలోనూ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ భావించారు. అయితే బీజేపీ వ్యూహాలు మహారాష్ట్రలో పనిచేయడం లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలు కూడా ఎంవీఏ కూటమిని ఆందోళనకు గురిచేసేదే కానీ.. మంత్రి చెప్పిన మాటలు నిజం అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉంటాయనేది ప్రశ్నార్థకమే.