Idream media
Idream media
ఎన్నికలు ఎప్పుడు అయిపోతాయ్ రా బాబూ.. రాజకీయ నేతల హడావిడి భరించలేకపోతున్నాం.. అని ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు అనుకుంటుంటే..ఎన్నికలు ముగిసిపోయాయి బాబోయ్ అని మిగిలిన రాష్ట్రాల ప్రజలు కలవరపడ్డ పరిస్థితులు చాలాచోట్ల కనిపించాయి.అందుకు కారణం ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రోబాదుడు మొదలుపెడుతుందన్న ప్రచారమే. ‘‘ప్రజలారా మీ వాహనాల ట్యాంకులు ఫుల్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నికలు ముగిశాయి. పెట్రో ధరలు పెరిగిపోతాయి.’’ అని విపక్ష నేతలు స్టేట్మెంట్ లు కూడా ఇచ్చారు. అయితే, పెట్రో ధరల మంట ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఇప్పటికే నూనె ధరలు సలసల అంటున్నాయి. ఈ క్రమంలో పెట్రో ధరలపై రాజ్యసభలో ఆసక్తికర చర్చ సాగింది.
ఆకాశాన్నంటుతున్న చమురు ధరల నుంచి ప్రజలకు మరికొద్ది రోజుల్లో ఊరట లభించనుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి చెప్పారు. రాబోయే నెలల్లో చమురు ధరలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. సోమవారం రాజ్యసభలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ మండలిలో ప్రతిపాదించగా.. రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదని వివరించారు. దేశంలో చమురు అవసరాలను తీర్చేందుకు 85 శాతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇంధన వినియోగం, దిగుమతుల్లో మన దేశం ప్రపంచంలో మూడోస్థానంలో ఉందని చెప్పారు.
పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంలో పురోగతి ఉందా? అని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు మంత్రి పురి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయని, మద్యం అమ్మకాలతోనూ ఖజానా నింపుకొంటున్నాయని.. ఈ రెండు వనరుల నుంచి రాబడిని తగ్గించుకునేందుకు సాధారణంగానే అంగీకరించవని చెప్పారు. అయితే రాబోయే నెలల్లో చమురు ధరల నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు.
రష్యా తగ్గింపు ధరలకే ముడి చమురు, ఇతర ఉత్పత్తులను అందజేస్తామని ఆఫర్ ఇచ్చిందని.. దానిపైనా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అలాగే వెనెజులా, ఇరాన్ నుంచి కూడా చమురు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు దేశాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అత్యధిక చమురు నిల్వలున్న ఈ దేశాలపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసే యోచనలో ఉందని, అదే జరిగితే భారత చమురు సంస్థలకు ముడి చమురు మరింతగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు 14 ఏళ్ల గరిష్ఠానికి చేరినప్పటికీ మనదేశంలో గత నవంబరు 4 నుంచి ఇప్పటి వరకు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగలేదని మంత్రి గుర్తుచేశారు. కేంద్రం పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. అదేసమయంలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించడంతో ప్రజలపై భారం తగ్గిందని వివరించారు. రాబోయే రోజుల్లో ధరల తగ్గింపునకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పారు. మరి ఆ చర్యలు నిజంగానే ఫలితాన్నిస్తాయా,లేదో చూడాలి.