iDreamPost
android-app
ios-app

పంచాయతీ నిధులకు ప్రత్యేక నిధులు, కేంద్రం నిర్ణయంతో ఏం జరుగుతుంది..

  • Published Mar 28, 2022 | 12:07 PM Updated Updated Mar 28, 2022 | 1:30 PM
పంచాయతీ నిధులకు ప్రత్యేక నిధులు, కేంద్రం నిర్ణయంతో ఏం జరుగుతుంది..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అంశాల్లో జోక్యం చేసుకుంటోంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే నూతన విద్య, వ్యవసాయ, విద్యుత్ విధానాల్లో జాతీయ విధానాల్లో మార్పు చేసింది. వాటిని అనుసరించిన రాష్ట్రాలకే నిధులు ఇస్తామని చెబుతోంది. తాజాగా పంచాయతీలపైనా పెత్తనం చేసేందుకు పూనుకుంటోంది. వాస్తవంగా పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక స్వపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి. కానీ తాజాగా కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయతీలకు అందించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా పంచాయతీలను కూడా తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే యత్నం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. తద్వారా స్థానిక ప్రభుత్వాల బలోపేతం అనే మాట అలా ఉంచి, భవిష్యత్తులో పూర్తిగా కేంద్రం మీద ఆధారపడాల్సిన స్థితికి నెడుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

ప్రతీ గ్రామ పంచాయతీకి కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవాలని ఉత్తర్వులు వచ్చాయి. దానికి అనుగుణంగా అన్ని చోట్ల ఖాతాలు తెరుస్తున్నారు. ఏప్రిల్ 1నాటికి కొత్త ఖాతాలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇకపై వివిధ ఆర్థిక సంఘాల నిధులు నేరుగా పంచాయతీలకు చేరుతాయి. ఇప్పటి వరకూ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తే, అక్కడి నుంచి స్థానిక సంస్థలకు కేటాయించేవారు. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం సానుకూలంగా ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా నిధులను దారి మళ్లించినప్పటికీ అవి పంచాయతీల అవసరాలకే వాడాల్సి వచ్చేది.

ఇకపై తద్విరుద్ధంగా కేంద్రమే పంచాయతీలకు నిధులు ఇస్తుంది. ఇంతకాలం పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు, నిధుల విషయంలో కేంద్రం తాత్సార్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీసేవి. దాంతో కేంద్రం వాటిని విడుదల చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై కేంద్రం ఇచ్చేవరకూ పంచాయతీ పాలకవర్గాలు వేచి చూడక తప్పదు. పంచాయతీలు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉండదు. కాబట్టి పంచాయతీల నిధుల విషయంలో కేంద్రం ఇస్తే వచ్చినట్టు, లేదంటే ఇక పంచాయతీలకు అంతే సంగతులు. ప్రస్తుత లెక్కప్రకారం తలకు రూ. 1760 చొప్పున గ్రామ జనాభాని బట్టి కేంద్రం నిధులు చెల్లిస్తుంది. వాటిని కేంద్రం నుంచి పంచాయతీలు ఎలా సాధిస్తాయన్నది ప్రశ్నార్థకమే అవుతుంది.

కేంద్ర ఇచ్చే నిధులను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆయా పంచాయతీలకు నిధులు ఉంటే, వాటిని పాలకవర్గం తీర్మానాలకు అనుగుణంగా వెచ్చించేందుకు వీలుంటుంది. కానీ అవి సకాలంలో జమకాకపోతే పంచాయతీల సమస్యలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కేంద్రం తాత్సార్యం చేసినా ప్రశ్నించే అవకాశం ఉండదు కాబట్టి పంచాయతీలకు అసలుకే ఎసరు తెచ్చే విధానంగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు భిన్నంగా ఇది పంచాతీయలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చివరకు ఏం జరుగుతుందన్నది పల్లెల అభివృద్ధికి మేలు చేస్తుందా లేదా మరింత చేటు తెస్తుందా అన్నది తేలుతుంది.