iDreamPost
android-app
ios-app

ఈ మాటల వెనుక మర్మమేమి బాబూ..

  • Published Mar 01, 2022 | 8:51 AM Updated Updated Mar 01, 2022 | 1:15 PM
ఈ మాటల వెనుక మర్మమేమి బాబూ..

జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉంది- చంద్రబాబు

అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడండి..మా వైపు రండి- జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు- సీపీఐ నాయకుడు రామకృష్ణ

మూడు పార్టీలు, ముగ్గురు నాయకులు, ఒకే రకమైన స్టేట్ మెంట్. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా.. కానీ ఇది ఏపీలో మాత్రం సాధ్యం. భిన్నమైన ఆలోచనలు కలిగిన పార్టీలు కూడా ఒకేరకంగా మాట్లాడుతుంటాయి. అందులోనూ జగన్ ని, వైఎస్సార్సీపీని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకే విధానం పాటిస్తాయి. ఒకే రకమైన పలుకులు భిన్న గొంతుల నుంచి వినిపిస్తాయి. ఇదంతా చంద్రబాబు మహిమేనన్నది రాజకీయాల గురించి తెలిసిన వారందరికీ ఇట్టే అర్థమవుతుంది.

చంద్రబాబు మాత్రమే మాట్లాడితే జనాలు నమ్మరని టీడీపీ అధినేత విశ్వాసం. అందుకే అన్ని పార్టీలలోని కొందరు నాయకులను తమకు అనుకూలంగా మలచుకుని వారితో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇది చాలాకాలంగా అనుసరిస్తున్న విధానం. కేవలం జనసేన, సీపీఐ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలో కూడా బాబుకి వత్తాసుపలుకుతూ బాబు మాటలనే తిరిగి వల్లించే సెక్షన్ సిద్ధంగా ఉంటుంది. అందులో తులసిరెడ్డి పేరు కాంగ్రెస్ నేతల్లోనూ, భాను ప్రకాష్‌ రెడ్డి వంటి వారు బీజేపీలోనూ ఉంటారని పలువురి అభిప్రాయం.

జగన్ కి వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారని, అన్ని పార్టీలు అవే మాట్లాడుతున్నారనే అభిప్రాయం కలిగించడం, తద్వారా చంద్రబాబు మాటలకు బలం చేకూర్చడం ఈ వ్యూహం వెనుక ఉద్దేశం. జగన్ పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందనే భావన పెంపొందించడం అసలు లక్ష్యం. తద్వారా ప్రజలను మ్యానిఫులేట్ చేసి అయినా పగ్గాలు సాధించాలనే చంద్రబాబు టార్గెట్ ఉంటుంది. ప్రజలను పక్కదారి పట్టించేందుకు తగ్గట్టుగా అన్ని పార్టీలను రంగంలో దింపడం అందులో భాగమే. ఏమయినా ఏపీలో కేవలం చంద్రబాబు చెబితే విశ్వసించే పరిస్థితి లేనప్పుడు ఇలా అన్ని పార్టీలను రంగంలో దింపడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించే స్వభావాన్ని బాబు పదే పదే చాటుకుంటున్నారు. కానీ గడిచిన మూడేళ్లకాలంలో ఆయన అంచనాలకు విరుద్ధంగా వ్యవహారం సాగుతుండడం టీడీపీ నాయకత్వానికి మింగుడుపడని పరిణామంగా ఉందని మాత్రం చెప్పవచ్చు.