iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం రాజీనామా చేసి, మూడు రాజధానులపై ప్రజల తీర్పు కోరాలి అని సవాల్ చేస్తున్న చంద్రబాబు ఆ అంశంపై 2019లోనే రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారన్న సంగతి మరచిపోయారా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని ఆరోపించారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారం విమర్శలు చేశారు.
మూడు రాజధానులకు జనామోదం ఉన్నట్టే కదా..
అమరావతి పేరిట చంద్రబాబు చూపిన గ్రాఫిక్స్, పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసిన వైనాన్ని జనం ఈసడించుకున్నారు కనుకనే ఆ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులను ప్రభుత్వం ప్రకటించిన తరువాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపాల్టీ, తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. అంటే సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి జనామోదం ఉన్నట్టే కదా. అటువంటప్పుడు కొత్తగా ప్రజాతీర్పు కోరాల్సిన అవసరం ఏముంది అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కౌలు తీసుకుంటున్న రైతులు త్యాగం చేసినట్టా..
అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అంటున్న చంద్రబాబుకు దానితోపాటు అధికార వికేంద్రీకరణ జరిగితే వచ్చే నష్టమేమిటో చెప్పాల్సి ఉంది. శాసన రాజధానిగా అమరావతిని ఉంచి కార్యనిర్వాహక, న్యాయ రాజధానులను వేరే చోట ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ఎలా అవుతుందో చంద్రబాబే వివరించాలి. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తున్నా వారేదో త్యాగం చేసినట్టు అభివర్ణించడం ఎందుకు? ప్రభుత్వం వారికి నమ్మక ద్రోహం చేసిందంటూ వ్యాఖ్యానించడంలో అర్థముందా?
సాధక బాధకాలు పట్టించుకోరా..
రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య పెడితే అభ్యంతరం లేదని నాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్ ఇప్పుడు కాదనడం మోసం అని చంద్రబాబు వాదిస్తున్నారు. కానీ అమరావతిపై అంత ప్రేమ ఉన్న చంద్రబాబు ఐదేళ్ల తన పాలనా కాలంలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే వెచ్చించగలిగారు. అంతకుమించి ఖర్చు చేయడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు. అంటే రూ.లక్ష కోట్లు పైబడి ఖర్చయ్యే అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లకు పైగా సమయం పడుతుంది.. అని రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడంలో ఉన్న సాధక బాధకాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు.
తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టు మొత్తం రాష్ట్రం అభివృద్ధిని పణంగా పెట్టి అయినా అమరావతిని నిర్మించాలనడం ఏ తరహా వాదం. సీఎంగా చంద్రబాబు నిర్వాకం వల్ల, ప్రతిపక్ష నేతగా కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం వల్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని ఏర్పరచుకోలేని దుస్థితి నెలకొంది. ఇంకా దీనిపై రాజకీయం చేస్తూ అమరావతి జపం చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పు తెలుగుదేశం పార్టీకి నామరూపాల్లేకుండా చేస్తుందన్న సంగతి గమనించాలని అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.