iDreamPost
android-app
ios-app

అక్బరుద్దీన్ పై దేశద్రోహం కేసు కొట్టివేత -తొమ్మిదేళ్ల తర్వాత తీర్పు

  • Published Apr 13, 2022 | 7:14 PM Updated Updated Apr 13, 2022 | 8:52 PM
అక్బరుద్దీన్ పై దేశద్రోహం కేసు కొట్టివేత  -తొమ్మిదేళ్ల తర్వాత తీర్పు

ఎంఐఎం (మజ్లీస్) శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ దేశద్రోహ అభియోగాల నుంచి విముక్తులయ్యారు. సుమారు పదేళ్ల క్రితం 2012లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా అరెస్టు అయిన అక్బరుద్దీన్ అప్పట్లో కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నారు. కేసులను దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సుమారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించలేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ నేపథ్యం

2012 డిసెంబర్ 22న ఉమ్మడి ఏపీలోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ పట్టణాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. నిర్మల్ సభలో మాట్లాడుతూ మీరు 100 కోట్ల మంది.. మేం 25 కోట్ల మంది.. అయినా మాకు ఒక్క 15 నిమిషాల సమయం ఇవ్వండి.. ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో చూపిస్తాం.. అని అక్బరుద్దీన్ సవాల్ చేశారు. అలాగే నిజామాబాద్ సభలో ఓ వర్గానికి చెందిన దేవతలను దూషించేలా మాట్లాడారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నిర్మల్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దేశద్రోహం ఆరోపణలతో రెండు కేసులు నమోదు చేశారు. తర్వాత వీటి దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈలోగా అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ను అరెస్టు చేయడంతో 40 రోజులు జైల్లో ఉన్నారు. ఆయనపై ఐపీసీ 153 ఏ, 120బి, 295 ఏ, 298, 188 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు

ఈ కేసును తొమ్మిదేళ్లపాటు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ నిర్వహించింది. 30 మందికిపైగా సాక్షులను, అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులని విచారించింది. వారంతా అక్బరుద్దీన్ విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారని చెప్పారు. అయితే ఆ ప్రసంగాలు అక్బరుద్దీన్ చేసినవి కావని ఆయన న్యాయవాదులు వాదించారు. అయితే సీఐడీ అధికారులు అవి అక్బరుద్దీన్ మాటలేనని నిర్ధారించే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా కోర్టుకు సమర్పించారు. అయినా అక్బరుద్దీన్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ కోర్టు కేసు కొట్టివేసింది. ఇకముందు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని హెచ్చరించింది. ఇలాంటివి దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. అలాగా కేసు కొట్టివేసినందుకు సంబరాలు చేసుకోకుండా ఆంక్షలు విధించింది.