iDreamPost
iDreamPost
రాయలసీమ రణభేరి సభ జరపటం సీమ ప్రజలను మోసం చేయడమే అని సీపీఐ రామకృష్ణ విమర్శించడమే కాక ఆ ప్రాంత అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో రాష్ట్ర మంత్రులతో చర్చించేందుకు సిద్ధం అని చెప్పే సోము… ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ అనేక ప్రశ్నలు సంధించారు.
వీటికి ఏం సమాధానం చెబుతారు..
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం సంగతి ఏమైంది. రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు విప్పలేదు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకపోగా, ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేసే ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని వాగ్దానం చేసి, మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి కోసం ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారా అని రామకృష్ణ ప్రశ్నించారు.
జనాగ్రహ సభలు, రణభేరిల వల్ల ప్రయోజనం ఏమిటి..
గత ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం ఒక శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ వచ్చే దఫా అధికారం మాదే అని చెబుతోంది. ఆ మధ్య జనాగ్రహ సభ, మొన్న రాయలసీమ రణభేరి అంటూ బహిరంగసభలు నిర్వహించి పెద్ద ఎత్తున హంగామా చేసింది. రోజూ మీడియా సమావేశాల్లో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై చేసే విమర్శలనే ఇటువంటి బహిరంగసభల్లో మళ్లీ ఏకరువు పెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి మంచి చేసే పనులను, పథకాలను ఈ సభల్లో ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసే వారిని నిరాశ పరుస్తున్నారు. రాష్ట్రానికి ఆల్‌రెడీ అన్ని ఇచ్చేశాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసేవన్నీ కేంద్రం ఇచ్చిన సొమ్ములతోనే అని చెప్పి జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు.
ఏమని బదులిస్తారో..
ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయిందని చెబుతున్న బీజేపీ నేతలు.. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు తెచ్చేందుకు అనుమతినిచ్చింది కేంద్రంలోని వారి ప్రభుత్వం అన్న సంగతి మరచిపోయారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఏపీలో నవరత్నాలను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నారు అని గొప్పలు చెబుతున్న సోము జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను ఎందుకు పూర్తి చేయడం లేదు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సహకరించడం లేదు అన్న ప్రశ్నలకు ఎప్పటి నుంచో సమాధానం చెప్పడం లేదు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఘంటాపథంగా చెప్పే సోము వీర్రాజు, ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధం అంటూ తరచు సవాళ్లు విసురుతుంటారు. ఇప్పుడు రాయలసీమ సమస్యలపై నిర్ధిష్ట ప్రశ్నలతో చర్చకు సిద్ధమా అంటున్న సీపీఐ రామకృష్ణకు సోము ఏమని బదులిస్తారో చూడాలి.