iDreamPost
iDreamPost
జనసేన గందరగోళంలో పడింది. యూపీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని అయోమయంలోకి నెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభ వేదికగా రాజకీయ విధానంపై స్పష్టత ఇవ్వాల్సి ఉండగా తాజాగా ఈ పరిస్థితి జనసేనాని సందిగ్ధంలో నెట్టినట్టు కనిపిస్తోంది. చివరకు తమ మిత్రపక్షం భారీ విజయాలతో దేశమంతా తమదేననే సంబరాలు చేసుకుంటుంటే జనసేన మాత్రం కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేని స్థితికి చేరింది. బీజేపీ విజయాన్ని ఆస్వాదించాలా లేక టీడీపీతో కలిసి వెళ్లేందుకు సంకేతాలు ఇవ్వాలా అన్నది జనసేన తేల్చుకోలేకపోతోంది.
జనసేన పార్టీ ఆవిర్భవించి 8 ఏళ్లు గడిచింది. కానీ రాజకీయంగా తప్పటడుగులు వేస్తూనే ఉంది. యూత్ లో ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వత ఆపార్టీకి పెద్ద శాపం అయ్యింది. అవకాశాలను అందుకోలేని స్థితికి చేర్చింది. వచ్చే సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ నేతలు పాదయాత్రలు, బస్సు యాత్రలంటూ ముందస్తు ఎన్నికల ప్రచారం అందుకున్నారు. అధికార పార్టీ కూడా శ్రేణులను సిద్ధం చేస్తోంది. జూలైలో నిర్వహించే ప్లీనరీ నాటికి మరింత దూకుడు చాటుకునే అవకాశాలున్నాయి. ఈ సమయంలో జనసేన తదుపరి ఎన్నికల వ్యూహం అస్పష్టంగా మారింది.
వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింటే జనసేన క్లారిటీ వచ్చేసేది. ఆపార్టీతో విడగొట్టుకుని మళ్లీ టీడీపీని బలపరిచే దిశలో అడుగులు వేసేది. కానీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. బీజేపీ రెట్టించిన ఉత్సాహంలో రాష్ట్రంలోనూ తమదే అధికారం అంటూ ప్రకటనలకు సిద్ధమవుతోంది. టీడీపీని ఒంటరి చేసి బలపడాలని బీజేపీ లెక్కలేస్తోంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు తమవైపు వస్తారని ఆశిస్తోంది అదే జరిగితే వైసీపీకి ప్రత్యామ్నాయం అవుతామని లెక్కలేస్తోంది. అందుకు అనుగుణంగా పవన్ తో కలిసి పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. తద్వారా టీడీపీని కట్టడి చేస్తే తమకు తిరుగులేని స్థానం దక్కుతుందని భావిస్తోంది. పవన్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. జగన్ ని కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు ఒకే వేదికమీదకు రావాలని ఆయన భావిస్తున్నారు. 2014 నాటి కూటమి కోసం చంద్రబాబు లానే, పవన్ కూడా ప్రయత్నిస్తున్నారు.
పవన్ అంచనాలకు, బీజేపీ ఆలోచనలకు పొంతన కుదరడం లేదు. అయినప్పటికీ బీజేపీని వీడి బయటకు రావడం శ్రేయస్కరం కాదనే అనుమానం పవన్ లో ఉంది. దాంతో బీజేపీని వీడలేక, బాబుకి దూరం కాలేక అన్నట్టుగా పవన్ కొట్టిమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో ఆవిర్భావ సభలో రాజకీయంగా దిశానిర్దేశం చేయాల్సిన పవన్ ఏం స్టాండ్ తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే బీజేపీతో కలిసి వెళుతూనే చంద్రబాబుతో స్నేహాన్ని మరింత బలపరిచేందుకు మార్గాలను ఆయన అన్వేషించే అవకాశం ఉంది. అందుకు బీజేపీ సహకరిస్తుందా అన్నదే చిక్కుముడి. ఇదే జనసేన పరిస్థితిని గందరగోళంలో మార్చడానికి మూలం అవుతోంది.