iDreamPost
android-app
ios-app

కౌలు రైతుల భరోసా యాత్ర.. జ‌న‌సేన ల‌క్ష్యం నెరవేరేనా?

కౌలు రైతుల భరోసా యాత్ర.. జ‌న‌సేన ల‌క్ష్యం నెరవేరేనా?

రైతులు లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ నేటి నుంచి కౌలు రైతుల భరోసా పేరుతో యాత్ర ప్రారంభించనుంది. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే.. బాధిత కౌలు రైతు కుటుంబంలోని పిల్లల చదువు బాధ్యతనూ జనసేన తీసుకోవాలనే దృఢ సంకల్పంతో పవన్‌కల్యాణ్‌ ఉన్నట్లు పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెబుతున్నారు. కాగా కౌలు రైతుల భరోసా యాత్ర’ను పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ప్రారంభించనున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామానికి చేరుకునే పవన్‌ అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఓ కౌలురైతు కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తారు. తర్వాత ధర్మవరంలో మరో కౌలురైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందిస్తారు. అనంతరం గొట్లూరు గ్రామంలో మరో కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట గ్రామంలో ఓ కౌలురైతు కుటుంబానికి సాయం అందిస్తారు.

అలాగే.. మన్నీల గ్రామంలో ఇద్దరు కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసి, గ్రామసభ(రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలురైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్థికసాయం అందజేసి, వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఏర్పాట్లను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతపురంలో మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పాకులాడుతున్నారే తప్ప.. రైతులు, ప్రజలసంక్షేమం కోసం ఏ మాత్రం ఆరాటపడటం లేదని ధ్వజమెత్తారు.