Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ మాదిరిగానే.. ఆ మాటకొస్తే అంతకు మించే ఆ రాష్ట్రంలో కాషాయవనం పాతుకుపోయింది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అడ్డా. అదే గుజరాత్. అటువంటి రాష్ట్రంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కన్నుపడింది. గత ఎన్నికల్లో పంజాబ్ ను అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకున్న తర్వాత దేశమంతా మోడీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీ వైపు ప్రజలు ఆలోచిస్తున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. దాన్ని నిజం చేస్తూ కేజ్రీవాల్ కూడా ఆ దిశగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ పై దృష్టి సారించింది.
ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తాజాగా గుజరాత్‌లో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సబర్మతి ఆశ్రమ పరిధిలోని హృదయ్ కుంజ్‌ను ఇద్దరు సీఎంలు సందర్శించారు. ఈ ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందస్తుగా ఇద్దరు ఆప్ సీఎంలు రెండు కిలోమీటర్లు రోడ్‌షో కూడా నిర్వహించారు. గాంధీజీ పుట్టిన దేశంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
అయితే.. పంజాబ్ ఫార్ములా గుజరాత్‌లో వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి. పంజాబ్ లో సాధించిన అద్భుతమైన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తులో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గట్టి ప్రభావం చూపించాలని బాగా పట్టుదలగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ విషయాన్ని పక్కనపెట్టేస్తే ముందు గుజరాత్ పై ప్రత్యేకదృష్టి సారించినట్లే కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఇప్పటికే సూరత్ అహ్మదాబాద్ లాంటి మూడు నాలుగు మున్సిపాలిటీల్లో ఆప్ తరపున ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లున్నారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న బీజేపీని కాదని కొన్ని మున్సిపాలిటీల్లో జనాలు ఆప్ అభ్యర్ధులను కార్పొరేటర్లుగా గెలిపించుకున్నారంటేనే మార్పు కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఈ పాయింట్ ఆధారంగానే కేజ్రీవాల్ రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కూడా ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీతోనే మొదలుపెట్టి చివరకు అసెంబ్లీపై జెండా ఎగరేశారు. ఇదే ఫార్ములాను గుజరాత్ లో కూడా పాటించాలి అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.