iDreamPost
android-app
ios-app

దీర్ఘకాలిక లక్ష్యాలతో కేజ్రీవాల్ అడుగులు, ఆయన లక్ష్యాన్ని చేరుతారా

  • Published Mar 26, 2022 | 2:00 PM Updated Updated Mar 26, 2022 | 5:46 PM
దీర్ఘకాలిక లక్ష్యాలతో కేజ్రీవాల్ అడుగులు, ఆయన లక్ష్యాన్ని చేరుతారా

దేశంలో మోడీ వ్యతిరేక కూటమి కోసం కొందరు నేతలు తహతహలాడుతున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కొందరు బీజేపీ వ్యతిరేకులు ఢీలా పడ్డారు. కానీ దానికి ముందు చాలా ఉత్సాహమే ప్రదర్శించారు. వారిలో మమతా బెనర్జీ, కేసీఆర్ సహా పలువురు నేతలు కనిపించారు. కానీ తాజా ఫలితాల తర్వాత కేజ్రీవాల్ వారిద్దరినీ అధిగమించేశారనే చెప్పాలి. తమ సొంత రాష్ట్రం వెలుపల విజయం సాధించిన ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఆయనకు తోడ్పడింది. కానీ టీఎంసీ ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.

ఆప్ పంజాబ్ లో గెలుపుతో పాటుగా ఉత్తరాఖండ్ లో బోణీ కొట్టింది. గోవాలోనూ సీట్లు గెలుచుకుంది. అంతటితో సరిపెట్టకుండా త్వరలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మీద గురిపెట్టింది. పంజాబ్, ఢిల్లీ విజయాలతో మరో హిమాలయ రాష్ట్రం కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. ఇక గుజరాత్ లో కూడా ఆప్ దూకుడుగా సాగుతోంది. ఇప్పటికే సూరత్ వంటి నగరాల్లో పాగా వేసింది. ఆరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరింత బలపడాలని ఆశిస్తోంది. వాటితోపాటుగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బాట వేసుకుంటోంది. ఉత్తరాదిన ఉనికి చాటుకుంటూ క్రమంగా దక్షిణాదికి విస్తరించాలనే లక్ష్యంతో ఆప్ ఉంది.

అదే సమయంలో 2024 నాటికి మోడీకి తానే ప్రత్యామ్నాయంగా కనిపించాలనే లక్ష్యం కేజ్రీవాల్ కి లేనట్టు కనిపిస్తోంది. ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా 2029 నాటికి తాను బలపడాలనే దీర్ఘకాలిక వ్యూహంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న తన పార్టీని మరింతగా విస్తరించే లక్ష్యం ఆయన పెట్టుకున్నారు. అందుకు బీజేపీ కన్నా కాంగ్రెస్ మీద ఆయన గురిపెట్టారు. క్రమంగా కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో కూడా కాంగ్రెస్ ని ఓడించి ఆయన గద్దెనెక్కారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తానే ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారు. తద్వారా మరో ఏడెనిమిదేళ్లకు రాజకీయంగా ప్రాబల్యం చాటుకుంటే బీజేపీని ఎదుర్కొనే బలం సంపాదించగలననే వ్యూహం ఆప్ లో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆప్ ఉనికి పెంచుకునేందుకు అనుగుణంగా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇవన్నీ కలిసి వస్తే తాము దేశమంతా ఓ ప్రధాన పార్టీగా కనిపించే స్థాయికి చేరుతామని ఆయన అంచనా వేస్తున్నారు. తద్వారా మోడీ వయసు పైబడడం, బీజేపీలో కొత్త నాయకత్వం వచ్చేలోపు తాను ప్రత్యామ్నాయం అవుతాననే లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది.