Idream media
Idream media
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై నేషనల్ అసెంబ్లీలో ఆదివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదా ప్రధాని పదవికి రాజీనామా చేయడం అనే మూడు ఐచ్ఛికాలను మిలిటరీ ఇప్పటికే ఆయన ముందుంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారు. తనపై అవిశ్వాసాన్ని విదేశం (అమెరికా) పన్నుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇందుకు తన వద్ద సాక్ష్యాలున్నాయని ఆదివారం మీడియాకు ఆయన ఓ రహస్యలేఖను చూపారు. అయితే అందులో ఏముందో తెలియరాలేదు. తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అమెరికా కుట్రపన్నిందని ఆయన ఆరోపించారు. తనపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో వీధుల్లోకి పోటెత్తాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘రేపు అవిశ్వాసాన్ని ఎలా ఎదుర్కొంటానో మీరు (ప్రజలు) చూస్తారు. మీరంతా జాగ్రత్తగా, ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నా. నాకు ఎదురవుతున్న పరిస్థితులు వేరే దేశంలో జరిగి ఉంటే, ఆ దేశ ప్రజలు వీధుల్లోకి పోటెత్తేవారు. కాబట్టి మీరు కూడా నాకోసం వీధుల్లోకి తరలివెళ్లండి. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు ఆ పనిచేయాలి’’ అని ఇమ్రాన్ అన్నారు. కాగా 342 సీట్లున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) గతవారం మెజారిటీ కోల్పోయిన విషయం తెలిసిందే.