iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరి రాజీనామాలు కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త వారితోపాటుగా ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరికి అవకాశాలు ఇచ్చేందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే సీఎం కూడా సమీకరణాల రీత్యా ఒకరిద్దరిని కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించేశారు. దాంతో పాత మంత్రుల్లో పదవి నిలబెట్టుకునేదెవరు, కొత్తగా అవకాశం దక్కేదెవరికీ అనే ఊహాగానాలు ఉధృతమయ్యాయి.
ఏపీ సీఎం తన క్యాబినెట్ సహచరులకు ఈనెల 27న విందు ఏర్పాటు చేశారు. మంత్రులందరినీ ఆహ్వానించారు. ఆ సమావేశంలోనే సీఎం అందరి రాజీనామాలు కోరుతారనే ప్రచారం సాగింది. అయితే కొత్త జిల్లాల విభజన ప్రక్రియ ముందున్నందున అది ఆలశ్యమవుతుందని తాజా సమాచారం. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల విభజన జరగబోతోంది. దానికి సంబంధించిన తుది నోటిఫికేషన్ ఈనెల 30 లేదా 31న విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. పలు వినతులు వచ్చినందున వాటిలో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాల విభజన పూర్తికాగానే కొత్త మంత్రుల మీద సీఎం దృష్టిపెడతారు. ఏప్రిల్ 4న సీఎం నరసారావుపేటలో పర్యటిస్తున్నారు. వాలంటీర్ల అభినందన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంత్రులు రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. మొదటి వారంలో పాత మంత్రులంతా వైదొలగగానే రెండో వారంలో ఏప్రిల్ 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని సమాచారం. దానికి తగ్గట్టుగా ఇప్పటికే సీఎంవోలో కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందనే సమాచారం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ముగ్గురు మహిళలు మంత్రులుగా ఉండగా, వారి స్థానంలో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దాంతో ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అధినేత ఆశీస్సులు ఎవరికుంటాయోననే చర్చ ఉధృతమవుతోంది.