iDreamPost
android-app
ios-app

సిఎం పదవికి బాబు అయోగ్యుడా ?! మరి సత్యకుమార్ సలహా పాటిస్తారా ?

  • Published Mar 30, 2022 | 8:52 AM Updated Updated Mar 30, 2022 | 8:56 AM
సిఎం పదవికి బాబు అయోగ్యుడా ?! మరి సత్యకుమార్ సలహా పాటిస్తారా ?

ఈమధ్యే తెలుగుదేశం పార్టీ మద్దతు దండిగా ఉన్న అమరావతి రైతుల సన్మానాన్ని అందుకున్న టిడిపికి ఆప్తుడు, బిజెపి జాతీయ కార్యదర్శి,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద పనిచేసిన సత్యకుమార్ తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే అమూల్యమైన సలహా కూడా ఇచ్చారు . యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామంటున్న పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో టిడిపి అయోగ్యుడిని కాక , యోగ్యుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని’ సలహా ఇచ్చారు . ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు .

సత్యకుమార్ ట్వీట్ తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి . సత్యకుమార్ ట్వీట్ ప్రకారం ఆలోచిస్తే ఆయన దృష్టిలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పనిచేయరన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది . అలాగే ఆయన తనయుడు , రాజకీయ వారసుడు యువ నాయకుడైన లోకేష్ కూడా సిఎం అభ్యర్థిగా పనికిరాడని తేల్చేసినట్టే ఉంది.

చంద్రబాబునాయుడు లోకేష్ ను భావి పార్టీ అధినేతగా చేసేందుకు తీవ్రంగా కృషిచేస్తుండటం గమనార్హం . మరోవైపు పసుపు పత్రిక ఈనాడు మాత్రం ఈ అభిప్రాయంతో విభేధిస్తున్నట్లు కనిపిస్తోంది . టిడిపి 40 ఏళ్ల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పత్రిక రాసిన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం , చతురత పార్టీకి పూర్వవైభవం తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం .

ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికార వైసిపి వ్యతిరేక పక్షాలన్నీ ఏకంకావాలని,వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని కూడా స్పష్టం చేశారు . అయితే వైసిపి అధికార పక్షాలు అధికారంలోకి వస్తే పాలనా బాధ్యతలను జనసేన స్వీకరిస్తుందని కూడా చెప్పారు . ఈనేపథ్యంలో సత్యకుమార్ ట్విట్టర్ సలహా ఆసక్తిని రేకెత్తిస్తోంది . వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని , పవన్ కల్యాణ్ ను సిఎం అభ్యర్థిగా అంగీకరించాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది . లేదా ఆయన ఆలోచన టీడీపీని ఉద్ధరించేందుకా?.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న స్పష్టమైన సంకేతాలు బిజెపి రాష్ట్ర , జాతీయ నాయకత్వం నుంచి రాకపోవడం గమనార్హం . మరోవైపు సత్యకుమార్ ట్వీట్ కు ఆసక్తికర సమాధానాలు వచ్చాయి . పార్టీ కార్యకర్తల అందరి అభిప్రాయం ఇదేనని కొంతమంది, పవన్ కల్యాణ్ సిఎం అభ్యర్థిగా అయితే అంగీకారమని మరికొందరు వ్యాఖ్యలు చేయడం విశేషం .