iDreamPost
android-app
ios-app

పోలీసులు అడ్డుకోవడానికి బీజేపీ ఏ ఉద్యమం చేసింది

  • Published Mar 09, 2022 | 5:38 PM Updated Updated Mar 09, 2022 | 6:50 PM
పోలీసులు అడ్డుకోవడానికి బీజేపీ ఏ ఉద్యమం చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులతో అడ్డుకుంటున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమైతే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారంటున్న విష్టువర్దన్‌రెడ్డి అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం ఉద్యమాలు చేసిందో చెప్పాలని వైఎస్సార్‌ సీపీ నేతలు అడుగుతున్నారు. పేరుకు జాతీయ పార్టీయే కాని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓట్లు, సీట్లు లేవు. నాయకులు తప్ప కార్యకర్తలు లేని ఆ పార్టీకి ఇక్కడ ఎప్పుడూ ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు. అన్ని స్థానాల్లో పోటీ చేద్దామన్నా ఆ పార్టీ తరపున రంగంలోకి దిగడానికి అభ్యర్థులు దొరకరు. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లను కూడా నిలుపుకోలేని దుస్థితిని బీజేపీ ఎదుర్కొంది. అటువంటి పార్టీ రాష్ట్రంలో ఏవో ఉద్యమాలు చేసేసినట్టు, ఏకంగా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నట్టు స్టేట్‌మెంట్లు ఇవ్వడం కామెడీగా ఉందని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

పోలవరం జాప్యానికి కేంద్రం కారణం కాదా..

పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుంటే రాష్ట్రం భజన చేస్తోందని ఆరోపణలు చేస్తున్న విష్ణువర్దన్‌రెడ్డి కేత్రస్థాయి వాస్తవాలు తెలిసే మాట్లాడుతున్నారా? పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి ఎప్పుడో తప్పుకున్న కేంద్రం.. ఆ పనిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే  రాష్ట్రానికి అప్పగించి చేతులు దులుపుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడినా చూసీచూడనట్టు వదిలేసింది. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులను ఏటీఎంలా మార్చుకుని అవినీతికి  పాల్పడ్డారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలైతే చేశారు కాని ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు ఇవ్వకుండా ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ మేరకే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ తమకు సంబంధం లేదని తప్పుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేరకైనా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా పోలవరం నిర్మాణంలో జాప్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అవుతోంది.

అవగాహన లేని వ్యాఖ్యలు

వాస్తవం ఇదైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోనట్టు ప్రకటనలు ఇవ్వడాన్ని బట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి విష్ణువర్దన్‌రెడ్డికి అవగాహన లేనట్టు అర్థమవుతోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తోందని, వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రశంసలు లభిస్తున్నాయన్న సంగతి విష్ణువర్దన్‌రెడ్డి గుర్తించాలని సూచిస్తున్నారు. టీడీపీ నాయకులు తరచుగా ఆంధ్రప్రదేశ్‌లో అసలు వ్యవసాయశాఖ ఉందా? అని చేసే విమర్శలనే విష్ణువర్దన్‌రెడ్డి వల్లె వేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఏపీలో వ్యవసాయ శాఖ దేశానికే మార్గదర్శకంగా పనిచేస్తోందన్న సంగతి తెలుస్తుందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు,