iDreamPost
android-app
ios-app

తిరుప‌తి సాంస్కృతిక ప్రేమికుడు “భూమ‌న‌”

తిరుప‌తి సాంస్కృతిక ప్రేమికుడు “భూమ‌న‌”

తిరుప‌తి ఒక అంద‌మైన ఆధ్యాత్మిక న‌గ‌రం. 1988, మే 15 ఎర్ర‌టి ఎండ‌ల్లో ఆంధ్ర‌జ్యోతి ట్రైనీ స‌బ్ ఎడిట‌ర్‌గా తిరుప‌తిలో కాలు పెట్టాను. వేడికి భ‌య‌ప‌డి ఎన్నాళ్లుంటానో అనుకున్నాను. పాతికేళ్లు ఉన్నా. వాతావ‌ర‌ణం వేడి కానీ మ‌నుషులు చ‌ల్ల‌నివాళ్లు. ఆద‌ర‌ణ‌, అభిమానం తిరుప‌తి ప్ర‌త్యేక‌త‌.

మిగ‌తా వూళ్ల‌కి పండ‌గ‌లొస్తేనే క‌ళ‌. తిరుప‌తిలో ప్ర‌తిరోజూ పండ‌గ క‌ళే. కార‌ణం తిరుమ‌ల స్వామి. ఏడాది పొడుగునా ఏవో ఉత్స‌వాలు. మ‌నం రోడ్డుపై వెళుతుంటే నెల‌లో స‌గం రోజులు మ‌ద గ‌జాలు ముందు న‌డుస్తుండ‌గా దేవుడు ఊరేగింపు ఎదుర‌య్యే ఏకైక వూరు. కొంత కాలం తిరుప‌తిలో వుంటే అదో వ్య‌స‌నంగా మారుతుంది.

జ‌ర్న‌లిస్టుగా ఎంద‌రో నాయ‌కుల్ని 30 ఏళ్లుగా చూశాను. వాళ్ల‌లో భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి, రాడిక‌ల్ భావ‌జాలంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతో కాంగ్రెస్‌లో వున్నారు. రాజ‌కీయంగా వైఎస్ క‌ష్టాల్లో వున్న‌ప్పుడు వెంట ఉన్నారు. అధికారంలో వున్న‌ప్పుడూ వున్నారు.

సాహిత్యం, చ‌రిత్ర‌పైన బాగా ఇష్టం. మంచి చ‌దువ‌రి. చాలా మంది ఇళ్ల‌లో పుస్త‌కాలు వుంటాయి. చ‌ద‌వ‌రు. ఈయ‌న చ‌ద‌వ‌డ‌మే కాదు, పుస్త‌కంలోని విష‌యాల‌పై అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. రాజ‌కీయాల్లో వున్నా, ఒక్కోసారి ఇమ‌డ‌లేని త‌నంతో వుంటారు. మ‌నుషుల్ని ప్లీజ్ చేయ‌డానికి హామీలు, వాగ్దానాలు నోటికొచ్చిన‌ట్టు ఇవ్వ‌లేరు. చేయ‌గ‌లిగితేనే చెబుతారు. ఈ నిక్క‌చ్చిత‌నం ఒక్కోసారి అనుచ‌రుల‌కి కూడా క‌న్ఫ్యూజ‌న్‌గా వుంటుంది. అన్నిటికి మించి భాషా ప్రేమికుడు. అంత‌కు మించి తిరుప‌తి ప్రేమికుడు.

టీటీడీ చైర్మ‌న్‌గా వున్న‌ప్పుడు వ‌రుస‌గా మూడేళ్లు భాషా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించారు. ప్ర‌పంచంలో వున్న అనేక మంది క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, భాషా ప్రేమికుల్ని తిరుప‌తి ర‌ప్పించారు. భాష‌ని సింహాస‌నంపై కూర్చోపెట్టి స‌న్మానం చేసిన ఉత్స‌వాలు. వ్య‌య‌ప్ర‌యాసాలు, రాజ‌కీయ ఒడిదుడుకుల వ‌ల్ల అంత పెద్ద ఎత్తున నిర్వ‌హించ లేక‌పోయినా తిరుప‌తిలో జ‌రిగే అనేక సాహిత్య‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌నే అనుసంధాన‌క‌ర్త‌.

ఈ మ‌ధ్య శ్రీ‌శ్రీ చిత్ర‌ప‌టాన్ని ప‌ల్ల‌కీలో ఉంచి తిరుప‌తి న‌డివీధిలో తానే స్వ‌యంగా మోశారు. ఒక మ‌హాక‌వికి ఇంత‌కు మించిన గౌర‌వం ఏముంటుంది.

తిరుప‌తి చ‌రిత్ర అంటే ఆయ‌న‌కి ప్రేమ‌, ప‌రిశోధ‌న‌. న‌గ‌రానికి సంబంధించిన ప్ర‌తి వీధికి చారిత్రాత్మ‌కంగా ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసు. దీంట్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24 తిరుప‌తి పుట్టిన రోజు. 892 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు పునాది వేశారు. ఈ ఆధారాలు సేక‌రించిన ఘ‌న‌త భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిదే. ఘ‌నంగా వేడుక‌లు జ‌ర‌గాలి. హ్యాపీ బ‌ర్త్ డే తిరుప‌తి.