Balakrishna PAఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటీవల కర్ణాటకలో పేకాట ఆడుతూ పీఏ బాలాజీ పట్టుబడ్డారు. అయితే బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే పీఏ గా డిప్యుటేషన్ ను రద్దు చేస్తూ అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా యంత్రాంగం. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలాజీ పీఏ గా వ్యవహరిస్తున్నారు.
గత ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలయ్యకు అధికారిక పీఏగా బాలాజీ వ్యవహరించారు. బాలయ్య హిందూపురం వస్తే ఆయన కార్యక్రమాలు మాత్రమే కాక హిందూపురంలో ఆయన రాజకీయ వ్యవహారాలను బాలజీనే దగ్గరుండి చూసుకుంటారు. అంతటి కీలకమైన స్థానంలో ఉన్న పీఏ బాలాజీ వైఖరి ప్రస్తుతం బాలయ్యకు తలనొప్పిగా మారింది.గతంలో కూడా బాలయ్యకు ప్రైవేట్ పీఏగా ఉన్న శేఖర్ వ్యవహారశైలి వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అప్పట్లో పీఏ శేఖర్‌పై అనేక ఆరోపణలు రావడం, పార్టీ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో ఆయన్ను హిందూపురం నుంచి పంపేశారు.
ఇప్పుడు బాలకృష్ణ పీఏ బాలాజీని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే ఈ పేకాట వ్యవహారం మార్చి నెలలో చోటు చేసుకుంది. మార్చి నెలలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర వద్ద కొందరు పేకాట ఆడుతున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో హిందూపురంకు చెందిన పేకాటరాయుళ్లు దొరికారు. పట్టుబడ్డవారిలో బాలకృష్ణ పీఏగా పనిచేస్తున్న బాలాజీ తో పాటు హిందూపురంకు చెందిన కొందరు చోటామోటా టీడీపీ నేతలు కూడా దొరికారు. నిందితులను కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచిన క్రమంలో వారికి రిమాండ్ విధించారు.