Idream media
Idream media
ప్రముఖ సినీహీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో వెంటనే అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్‌ఆర్ రెస్టారెంట్ వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై కర్ణాటక స్పెషల్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ దాడులలో హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్నట్టు గుర్తించారు. పట్టుబడ్డ వారిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఎతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు గౌరిబిదనూర్ పోలీసులు తెలిపారు.
పట్టుబడ్డ వారి నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కర్ణాటకలోని చిక్బలాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచినప్పటి నుంచి బాలాజీ పీఏగా వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలయ్యకు అధికారిక పీఏగా బాలాజీ వ్యవహరించారు. బాలయ్య కార్యక్రమాలతో పాటు హిందూపురంలో ఆయన రాజకీయ వ్యవహారాలు కూడా బాలాజీనే దగ్గరుండి చూసుకుంటాడని అంటున్నారు. ఇక కీలక వ్యక్తిగా ఉన్న బాలాజీ వైఖరి ప్రస్తుతం తలనొప్పిగా మారింది.
గతంలో కూడా బాలయ్యకు ప్రైవేట్ పీఎగా ఉన్న శేఖర్ వ్యవహార శైలి వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయి. అప్పట్లో పీఎ శేఖర్‌పై అనేక ఆరోపణలు రావడం, పార్టీ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో ఆయనను హిందూపురం నుంచి పంపేశారు. ఆ తర్వాత కూడా శేఖర్ పీఎగా ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడినట్టు తేలడంతో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా వరుసగా బాలకృష్ణ పీఎలు ఇద్దరూ వివాదాస్పదంగా మారడంతో వారి తీరు ఇలాగే ఉంటుందా అని హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారం మీద బాలయ్య ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.