iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. రాజకీయంగా చర్చనీయాంశాలవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు సీటుకి ఎసరుపెట్టాలని చాలాకాలంగా ఓ వర్గం యత్నిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీని వీడి బీజేపీలో చేరిన నేతలంతా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి వీర్రాజుని తొలగిస్తేనే బీజేపీతో తమ బంధానికి బాటలు వేయగలుగుతామనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. దానికి తగ్గట్టుగా వీర్రాజుని సాగనంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే పలువురు నేతలు హస్తినలో పావులు కదుపుతున్నారు. సోము వీర్రాజు మీద పలు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా అదే ఊపుతో విజయవాడలో ఓ సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న వై సత్యకుమార్ ఆత్మీయ సమావేశం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు సన్నిహితులు లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ ,పాతూరి నాగభూషణం ,మాజీ MLA విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు, SK బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు కీలకంగా వ్యవహరించారు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల పేరుతో సోము వీర్రాజు తన సొంత ప్రాంతం రాజమహేంద్రవరంలో భారీ కార్యక్రమం నిర్వహణలో ఉండగా విజయవాడలో మరో వర్గం నేతలంతా సమీకృతం కావడం విశేషం. యూపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన సత్యకుమార్ కి అభినందన పేరుతో దానిని నిర్వహించారు. అదే సమయంలో కనీసంగా సైతం సోము వీర్రాజు పేరు ప్రస్తావించకపోవడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆహ్వానం కూడా లేకుండా ఆర్భాటంగా ఈ కార్యక్రమం సాగించడం ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఏపి రాజకీయాలపై సత్యకుమార్ దృష్టి పెట్టాలని ఆయా నేతలు సభాముఖంగా కోరడం కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది.
త్వరలో అద్యక్ష పదవి మార్పు ఉంటుందని బావిస్తున్న ఈ వర్గమంతా సత్యకుమార్ ని ప్రతిపాదించేందుకు సంకేతాలుగా భావిస్తున్నారు. సత్యకుమార్ సుదీర్ఘకాలం వెంకయ్యనాయుడి దగ్గర పనిచేశారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు దాంతో వెంకయ్య ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బీసీ కులస్తుడైన సత్యకుమార్ ని ప్రోత్సహించి కాపు కులస్తుడు అయిన సోము వీర్రాజు ని సాగనంపే స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.ఏపీలో కాపుల మీద గట్టి ఆశలుపెట్టుకున్న బీజేపీనేతలు కూడా ఈ సమీకరణాలను వ్యతిరేకించినట్టు సమాచారం. జీవీఎల్ వంటి వారు దూరంగా ఉండడం వెనుక ఇదే కారణంగా భావిస్తున్నారు. సోము వీర్రాజుని అడ్డుగా భావిస్తున్న చంద్రబాబు పథకంలో బాగంగానే ఇదంతా జరుగుతుందనే అభిప్రాయం తాజా పరిణామాలతో బలపడుతోంది.