Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది. గడిచిన మూడేళ్లలో నూట ముఫ్పైకి పైగా అవార్డులు పలు విభాగాల్లో ఏపీ పోలీసులు సొంతం చేసుకున్నారు. కృత్రిమ మేధ, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి. స్మార్ట్ పోలీసింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ‘‘స్కోచ్’’ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన పురస్కారాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
కరోనా సమయంలో ఏపీ పోలీస్ పనితీరుకు ప్రశంసలు దక్కాయి. దిశ యాప్ మహిళల రక్షణపై ఏపీ పోలీసుశాఖకి ఇప్పటివరకు 17 అవార్డులు వచ్చాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ ప్రారంభించిన తర్వాత నుంచి రాష్ట్రంలో యాభై లక్షల మందికిపైగా ఈ యాప్ డౌన్ లోడ్ చేశారు. దిశ యాప్ తో మహిళలకి దైర్యం వచ్చింది. దిశ యాప్తో అన్ని విధాల రక్షణ లబిస్తుందని మహిళలు భావిస్తున్నారు. రోజుకి 4 వేల వరకు కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్ ఒక్కదానికే గతంలో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. పోలీస్ సేవా యాప్ ను ఇప్పటి వరకు 7 లక్షల పైన డౌన్లోడ్ చేసుకున్నారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా జవాబుదారితనంతో త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నారు ఏపీ పోలీసులు.
ఇప్పుడు తాజాగా పోలీస్, రక్షణ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 2020, 2021లో జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. ‘‘స్కోచ్’’ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డులలో 23 అవార్డులను ఏపీ పోలీస్‌శాఖ సొంతం చేసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. స్వర్ణంతో పాటు ఎనిమిది రజత పతకాలతో మొత్తం 23 అవార్డులు ఏపీని వరించాయి. దేశంలోనే అత్యధిక అవార్డులు(175)తో ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్‌శాఖ ఆదర్శంగా నిలుస్తోంది. మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్ షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తిస్థాయి డిజిటైజ్ విధానం, క్లిష్టమైన కేసులను చేధించడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలలో రాష్ట్ర పోలీసులు అవార్డులు పొందారు. ప్రజా సేవలో జాతీయ స్థాయిలో తమ పనితీరు తో ఆకట్టుకున్న ప్రతి ఒక్కరికీ ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.