iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు విపక్షం యత్నిస్తోంది. అనేక మార్గాలను అందుకోసం అన్వేషిస్తోంది. ఏవీ వీలుకాకపోతే చివరకు న్యాయపరమైన చిక్కులు సృష్టించి ప్రభుత్వం ముందుకెళ్లకుండా నిలువరించే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చివరకు జిల్లాల విభజనను కూడా కొందరు అడ్డుకునేందుకు యత్నించారు. టీడీపీ మద్ధతురాలు ముగ్గురు పిటీషన్ వేశారు. ఏపీ హైకోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో ఆర్టికల్ 371 డి కి విరుద్ధంగా జిల్లాల విభజన ఉందనే వాదనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో 9 జిల్లాలను ఏకంగా 32 జిల్లాలుగా మార్చారు. ఏపీలో మాత్రం యధావిధిగా కొనసాగించారు. దాంతో తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. దానికి అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాలనాపరమైన సంస్కరణలతో అటు రాష్ట్రస్థాయి నుంచి అటు గ్రామీణ ప్రాంతాల వరకూ విశేష మార్పులు చేస్తున్న ప్రభుత్వం అందుకు కొనసాగింపుగా జిల్లాల విభజన చేపట్టింది. అందుకు అనుగుణంగా 26 జిల్లాలుగా నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాలు సేకరించింది. తుది ప్రకటనకు సిద్ధమవుతోంది. అరకు పార్లమెంట్ సీటుని మాత్రమే పాలనకు అనుగుణంగా రెండు జిల్లాలుగా మార్చగా, మిగిలినవన్నీ దాదాపుగా పార్లమెంట్ స్థానాలనే జిల్లాలుగా కొనసాగిస్తూ పాలనలో కొత్త పంథాకి శ్రీకారం చుట్టింది.
దీనిని కూడా అడ్డుకునే యత్నం జరిగింది. వాస్తవానికి ఆర్టికల్ 371 డి ప్రకారం ఉద్యోగాల కల్పనకు ఉమ్మడి రాష్ట్రాన్ని జోనల్ వారీగా విభజించారు. అయినా జిల్లాల విభజనకు అది అడ్డంకి లేకుండా తెలంగాణాలో పూర్తి చేశారు. ఏపీలో సైతం అదే పద్ధతి అవలంభించారు. కేవలం కొత్తగా ఏర్పాటవుతున్న బాలాజీ జిల్లాలో నెల్లూరు నుంచి ఉద్యోగులను కేటాయించడం సమస్య అవుతుందనే అంశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. దానికి అనుగుణంగా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తోంది. గెజిట్ మార్చేందుకు రాష్ట్రపతికి కూడా నివేదించాలని భావించింది. అన్ని జాగ్రత్తలతో ఈ విషయాన్ని పరిష్కరించే యత్నంలో ప్రభుత్వం ఉండగా, దానిని సాకుగా చూపించి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నించడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఏమయినా జోనల్ విధానానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నందున జిల్లాల విభజన ప్రక్రియకి ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు భావించాలి.