iDreamPost
android-app
ios-app

రాజధాని పిటీషన్లపై తీర్పు ఎలా ఉండబోతోంది..?

రాజధాని పిటీషన్లపై తీర్పు ఎలా ఉండబోతోంది..?

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై న్యాయస్థానాల్లో వివాదాలు తుది దశకు వచ్చాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ, టీడీపీ సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై నేడు (గురువారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

పాలనా వికేంద్రీకరణ, సాగు చట్టాల రద్దులను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఆయా చట్టాలను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. సాంకేతికపరమైన లోపాలను సరి చేసి, మూడు రాజధానులపై అందరి అనుమానాలను తీర్చేలా సమగ్రమైన బిల్లులు ప్రవేశపెడతామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రభుత్వమే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకం అయ్యాయి. అయితే తమ వ్యాజ్యాలను విచారించి, తగిన తీర్పు ఇవ్వాలంటూ పిటీషన్‌దారులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆయా వ్యాజ్యాలలో ఏఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి..? వాటిపై ఎలాంటి తీర్పు ఇవ్వాలనే అంశంపై ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటీషన్‌దారులు, ప్రభుత్వ వాదనలను ఆలకించింది.

రెండు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున వాటిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ ఇక అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ విషయంలో విచారణను ముగించాలని కోర్టును కోరారు. ఆయా చట్టాలను మళ్లీ తెస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. తమ పిటీషన్లపై విచారణ కొనసాగించాలని పిటీషన్‌దారులు వాదించారు. ఇరువైపుల వాదనలను పలుమార్లు విన్న ధర్మాసనం.. విచారణను పూర్తి చేస్తూ గత నెల 4వ తేదీన తుది తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.