iDreamPost
android-app
ios-app

రాజధాని పనులకు 4 ఏళ్ళు పైనే పడుతుంది.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

రాజధాని పనులకు 4 ఏళ్ళు పైనే పడుతుంది.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఈ రోజు హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. గత నెల 3న ఏపీ హైకోర్టు రాజధాని అమరావతి రైతుల భూములను నెలరోజుల్లో అభివృద్ధి చేసి వారికి అందజేయాలని తీర్పునిచ్చింది. ఈ గడువు రేపటిలోగా ముగియనుండడంతో ప్రభుత్వం 190 పేజీల‌తో కూడిన ప‌లు అంశాల‌ను ప్రస్తావిస్తూ అఫిడ‌విట్‌ను దాఖలు చేసింది. అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ కూడా చేపట్టింది.

ఈ క్రమంలోనే అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టుకు సీఎస్ సమీర్ శర్మ ప్రభుత్వం తరపున 190 పేజీల అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. అలాగే హైకోర్టు తీర్పును అమలుచేసే క్రమంలో అమరావతిని అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్ల గడువు ఇవ్వాలని కోరారు. వాస్తవానికి సీఆర్డీఏ చట్టం ప్రకారం చూసినా 2024 వరకు అమరావతిని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆరునెలల్లో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యంకాదని ఆయన హైకోర్టుకు తెలిపారు.

అయితే అమరావతి సహా కర్నూలు, విశాఖలలో కూడా రాజధానులు ఏర్పాటు కోసం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయితే అప్పటికే వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని, అమరావతిని మాత్రమే సీఆర్డీఏ చట్టం ప్రకారం అభివృద్ధి చేయాలని గతంలో తీర్పు ఇచ్చింది. అంతేకాదు నెలరోజుల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని, అలాగే ఆరునెలల్లో అమరావతి పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. వీటి వివరాలను ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది.