Idream media
Idream media
ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభంకానుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ శాసన సభలో వెల్లడించారు. జిల్లాల విభజన, పాలన ప్రారంభించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నా.. కేంద్రం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు.. అంటూ ప్రతిపక్ష టీడీపీ, అనుకూల మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగంలో కొత్త జిల్లాల్లో పాలన గురించి క్లారిటీ ఇచ్చారు. దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో వైసీపీ సర్కార్ మూడేళ్ల పాలనలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతోపాటు రాబోయే రోజుల్లో చేపట్టబోయే పథకాలు, పనుల గురించి గవర్నర్ వివరించారు.
కాగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎప్పటి మాదిరిగానే శాసన సభ సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు యత్నించింది. జాతీయ గీతాలాపన తర్వాత సభ ప్రారంభం అయింది. గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే.. టీడీపీ సభ్యులు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు కాపాడలేని గవర్నర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించివేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత టీడీపీ సభ్యులు మిన్నుకుండిపోయారు.