iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ క్యాబినెట్ భేటీ అయ్యింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశంతో వాయిదా వేశారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన స్పీచ్ ప్రారంభంకాకముందే టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆయన వయసుకి కూడా గౌరవం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. గవర్నర్ అంటే మీ పార్టీనో, మాపార్టీనో కాదని కూడా మీకు తెలియదా అంటూ అచ్చెన్నాయుడిని నిలదీయడంతో ఆయన ఖంగుతినాల్సి వచ్చింది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార భాషా చట్టాన్ని సవరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలుగుతో పాటుగా రెండో అధికార భాషగా ఉర్దూని నిర్ణయించారు. దానికి అనుగుణంగా చట్టాన్ని సవరిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు.
ఇక కీలకమైన టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం చట్టాన్ని సవరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. టీటీడీ బోర్డు సభ్యులతో పాటుగా మరికొందరు ఆహ్వానితుల కోసం ఇటీవల ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి చట్టపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. దాంతో హిందూ ధార్మిక సంస్థల చట్టసవరణ ద్వారా ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అడ్డంకులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించడంతో ఈ బిల్లు కూడా ఈ సమావేశాల్లో శాసనసభ ముందుకు రాబోతోంది.
జిల్లాల పునర్విభజనపై క్యాబినెట్ భేటీలో చర్చించారు. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఇతర అంశాలను కూడా క్యాబినెట్ చర్చించింది. అసెంబ్లీ లో ప్రతిపాదించాల్సిన బిల్లులను చర్చించారు. అంతకుముందు తొలుత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు సమావేశంలో మౌనం పాటించారు.